Tirumala : తిరుమలలో మరోసారి చిరుతపులుల కలకలం రేగింది. అలిపిరి నడకదారిలోని ఆఖరి మెట్ల వద్ద రెండు చిరుతలు సంచరించడాన్ని చూసిన భక్తులు బిగ్గరగా కేకలు పెట్టి భయంతో పరుగులు తీశారు. భక్తుల కేకలతో చిరుతలు రెండూ అడవిలోకి పారిపోయాయి. సమాచారం అందుకున్న విజిలెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. చిరుత జాడలను గుర్తించేందుకు ఫారెస్ట్ సిబ్బంది రంగంలోకి దిగారు. చిరుతపులుల సంచారంతో అప్రమత్తమైన భద్రత సిబ్బంది భక్తులను గుంపులుగా పంపుతున్నారు.
ఈ నెల 15వ తేదీన తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డులో చిరుత కనిపించింది. తెల్లవారుజామున భక్తుల కారుకు చిరుత అడ్డొచ్చింది. కారు సీసీటీవీ కెమెరాలో చిరుత దృశ్యాలు రికార్డు అయ్యాయి. చిరుతను చూసిన భక్తులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. చిరుత రోడ్డును దాటుకొని వెళ్లిపోవడంతో భక్తులు పీల్చుకున్నారు. గతంలో కూడా తిరుమలలో పలుమార్లు చిరుతలు కనిపించడం భక్తులను భయాందోళనకు గురి చేసింది. తాజాగా మరోసారి తిరుమలలో రెండు చిరుతలు కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.