Tirumala Brahmotsavam : గోవిందనామ స్మరణతో సప్తగిరులు మార్మోగుతున్నాయి. భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజున స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. పరిమళ భరిత పూలమాలలు, విశేష ఆభరణాలతో అలంకృతులైన స్వామివారు నాలుగు మాడ వీధులలో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేస్తున్నారు. వాహన సేవను తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. స్వామివారి వైభోగాన్ని కనులారా వీక్షిస్తున్నారు.
మాడ వీధుల్లో హనుమంత వాహనం ముందు భక్తజన బృందాలు చెక్క భజనలు, మంగళ వాయిద్యాల నడుమ, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా వాహనసేవ వైభవంగా జరుగుతోంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆలయంలో సాయంత్రం 4 గంటల నుంి 5 గంటల వరకు స్వర్థ రథోత్సవం నిర్వహించనున్నారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స్వామివారికి గజ వాహనసేవ ఉండనుంది.