Tilak Varma :రెండు సెంచరీలు కొట్టా.. ఇక్కడ మీకో ఫన్నీ విషయం చెబుతున్నా: తిలక్ వర్మ
అతను దక్షిణాఫ్రికాలో తన మునుపటి అనుభవాన్ని ఫన్నీగా గుర్తుచేసుకున్నాడు. “గతేడాది నేను ఇక్కడ ఆడినప్పుడు మొదటి బంతికే ఔట్ అయ్యాను. ఈ ఏడాది దక్షిణాఫ్రికాపై వరుసగా రెండో సెంచరీ చేయడం ఆనందంగా ఉంది. అప్పుడే మరోసారి అవకాశం వస్తే నిరూపించుకోవాలని బలంగా అనుకున్నా. ఇప్పుడీ సెంచరీతో ఆ లోటును పూరించుకున్నా. భారత్ విజయం సాధించిన ఇన్నింగ్స్‌లో కీలక పాత్ర పోషించినందుకు ఆనందంగా ఉంది. గత మ్యాచ్‌లో ఎలాంటి ఆటతీరును ప్రదర్శించానో.. ఇప్పుడూ అవే సూత్రాలకు కట్టుబడి బ్యాటింగ్ చేశా. కెప్టెన్ సూర్యకుమార్‌కు మరోసారి ధన్యవాదాలు చెబుతున్నా. దక్షిణాఫ్రికాలో కఠిన సవాళ్లు ఉంటాయని తెలుసు. ఈ సిరీస్‌కు ముందు గాయాలకు గురయ్యా. కోలుకొని వచ్చాక మైదానంలోకి దిగేందుకు చాలా శ్రమించా. అందుకే, ఆ దేవుడి కోసం నా సంబరాలను అలా చేసుకున్నా,” అని అతను చెప్పాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. భారత్‌కు బ్యాటింగ్ ప్రారంభించిన సంజూ శాంసన్, అభిషేక్ శర్మ 73 పరుగుల ఘన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అభిషేక్ 18 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 36 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఆరో ఓవర్లో లూథో సిపమల అతన్ని పెవిలియన్‌కు పంపాడు.
అనంతరం తిలక్ వర్మ, శాంసన్‌లు బ్లాస్టింగ్ ఇన్నింగ్స్‌లు ఆడారు. సంజూ శాంసన్ 18వ ఓవర్‌లో కేవలం 51 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే తిలక్ వర్మ రెండో టీ20 సెంచరీని నమోదు చేశాడు. శాంసన్, తిలక్ మధ్య 210 పరుగుల రికార్డు బ్రేకింగ్ భాగస్వామ్యంతో భారత్ 20 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 283 పరుగుల భారీ స్కోరు చేసింది. శాంసన్ 51 బంతుల్లో 109 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడగా, తిలక్ కేవలం 47 బంతుల్లో 120 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఒత్తిడిలో దక్షిణాఫ్రికా జట్టు 19 ఓవర్లలో 148 పరుగులకే కుప్పకూలింది. ఆతిథ్య జట్టులో ట్రిస్టన్ స్టబ్స్ (29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు), డేవిడ్ మిల్లర్ (27 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 36 పరుగులు) టాప్ స్కోరర్లుగా నిలిచారు.