New Criminal Laws : నేటి నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వస్తున్నాయి. భారత న్యాయ వ్యవస్థలో మూడు కొత్త నేర చట్టాలైన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. భారత శిక్షా స్మృతి (ఐపీసీ), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (సీఆర్ పీసీ), భారత సాక్ష్యాధార చట్టాల చరిత్ర గత అర్థరాత్రితో ముగిసిపోయింది.
అయితే, కొత్త చట్టాలలో జీరో ఎఫ్ఐఆర్, ఫిర్యాదులను ఆన్ లైన్ లో నమోదు చేయడంతో పాటు ఎస్ఎంఎస్ పద్ధతిలో సమన్లు జారీ చేసే అవకాశం ఉంటుంది. పెద్ద నేరాలకు సంబంధించిన క్రైం సీన్లను తప్పనిసరి వీడియోల్లో చిత్రీకరించడం వంటి కొత్త రూల్స్ న్యాయ వ్యవస్థలోకి వచ్చాయి. బ్రిటీష్ కాలం నాటి చట్టాల మాదిరిగా శిక్షకు కాకుండా, న్యాయం అందించేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. చట్టాల పేరు మాత్రమే కాదు, వాటి సవరణలు పూర్తి భారతీయ సంప్రదాయంలో రూపొందించినట్లు తెలిపారు. కొత్త చట్టాలు రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయాన్ని అందిస్తాయని ఆయన వెల్లడించారు.