JAISW News Telugu

Kedarnath : విరిగిపడిన కొండచరియలు.. ముగ్గురు కేదార్ నాథ్ యాత్రికుల మృతి

Kedarnath

Kedarnath

Kedarnath : కేదార్ నాథ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి ముగ్గురు యాత్రికులు మృతి చెందారు. చార్ ధామ్ యాత్రలో భాగంగా వెళ్తుండగా ఆదివారం ఈ విషాదం చోటు చేసుకుంది. ముగ్గురు యాత్రికులు కొండచరియల కింద చిక్కుకుని చనిపోగా, మరొకరు గాయపడినట్లు తెలిసింది. మృతి చెందినవారు అరుణ్ పరటె (31) (నాగపూర్), సునీల్ మహదేవ్ కాలే (24) (మహారాష్ట్ర), అనురాగ్ బిస్త్ (రుద్రప్రయాగ్)గా పోలీసులు గుర్తించారు. ఆదివారం ఉదయం 7.30 గంటలకు ఎమర్జెన్సీ కంట్రోత్ రూంకు ఈ దుర్ఘటనకు సంబంధించి సమాచారం అందిందని రుద్రప్రయాగ్ జిల్లా విపత్తు నిర్వహణ అధికారి నందన్ సింగ్ రిజ్వర్ మీడియాకు తెలిపారు. కేదార్ నాథ్ యాత్ర మార్గంలోని ఛిర్బస సమీపంలో యాత్రికులు కొండచరియల కింద ఉన్నట్లు తెలిసిందని చెప్పారు.

సమాచారం అందిన వెంటనే హుటాహుటిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఎనిమిది మంది యాత్రికులను కాపాడారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు ముగ్గురు యాత్రికులు మృతి చెందారు.

ఈ ఘటనతో కేదార్ నాథ్ యాత్ర కాస్త నెమ్మదించింది. యాత్రికులకు అసౌకర్యం కలుగకుండా చూసుకునేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. దుర్ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్ లో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బద్రీనాథ్ హైవేపై కూడా కొండచరియలు విరిగిపడుతుండడంతో యాత్రికు ఇబ్బందులు పడుతున్నారు.

Exit mobile version