JAISW News Telugu

YCP-TDP : వైసీపీ నుంచి ముగ్గురు – రాజ్యసభలో టీడీపీ తొలిసారి ‘ఖాళీ’..!!

YCP-TDP

YCP-TDP

YCP-TDP : ఏపీ రాజ్యసభ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు రాజ్యసభ ఎన్నికలను వైసీపీ, టీడీపీ ప్రతిష్టాత్మకంగా భావించాయి. 3 స్థానాల ఎన్నికలకు నామినేషన్లు మొదలయ్యాయి. ఏపీ శాసన సభలో పార్టీల బలాల ఆధారంగా వైసీపీ 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. సీఎం జగన్ వారికి బీ-ఫాం ఇచ్చారు. టీడీపీ పోటీ చేయాలని భావించినా.. ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వైసీపీ 3 స్థానాలు దక్కించుకుంటే 41 ఏళ్ల టీడీపీ చరిత్రలో తొలిసారి రాజ్యసభలో ప్రాతినిధ్యం కోల్పోనుంది.

పెద్దల సభకు ఎన్నికలు..
ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 3 సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. వారిలో వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ నుంచి సీఎం రమేష్, టీడీపీ నుంచి కనకమేడల రవీంద్ర కుమార్ విరమణ పొందనున్నారు. ఈ ఖాళీలను భర్తీ చేయాలని ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. సభలో సంఖ్యాబలం ఆధారంగా ఒక్కో రాజ్యసభ సభ్యుడు 44 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. వైసీపీకి సభలో ప్రస్తుతం 151 మంది ఉన్నారు. దీంతో వైసీపీ 3 సభ్యులను గెలుచుకొనే అవకాశం ఉంది. ఇదే సమయంలో టీడీపీ సీటు దక్కించుకోకుంటే రాజ్యసభలో ప్రాతినిధ్యం కోల్పోయే పరిస్థితి ఉంది. ఎన్నికల సమయంలో ఈ పరిణామం ప్రతికూలంగా మారుతుందని బాబు ఆలోచన చేశారు.

టీడీపీ పోటీ చేసేనా..
రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి తెలుగుదేశం పార్టీ కసరత్తు చేసింది. వైసీపీలో సీట్లు దక్కని వారి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేసింది. టీడీపీకి ప్రస్తుతం 18 మంది సభ్యుల బలం ఉంది. మరో 26 మంది మద్దతు అవసరం కానుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహకరించిన వైసీపీ సభ్యులు నలుగురిపై చర్యలు ఖాయంగా కనిపిస్తున్నాయి. దీంతో.. టీడీపీకి 26 మంది మద్దతు కూడగట్టడం కష్టంగా మారుతున్నట్లు తెలుస్తోంది. నామినేషన్లకు మరో 3 రోజులు మాత్రమే ఉంది. టీడీపీ అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. వైసీపీలో సీట్లు దక్కని కొందరు తిరిగి కొనసాగాలని నిర్ణయించారు. దీంతో, 26 మంది మద్దతు దక్కుతుందా అనే ఆలోచనలో టీడీపీ ఉన్నట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే పోటీపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయానికి రాలేదు.

వైసీపీ సభ్యుల నామినేషన్లు..
ఈ సమయంలోనే వైసీపీ నుంచి వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, రఘునాథ రెడ్డికి సీఎం జగన్ బీఫాం ఇచ్చారు. నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డికి ఎన్నికల్లో పోటీకి అవకాశం దక్కలేదు. ఆయనను రాజ్యసభకు పంపిస్తానని గతంలో పార్టీ అధినేత జగన్ హామీ ఇచ్చారు. రఘునాథ రెడ్డి, గొల్లబాబూరావుకు సీట్ల సర్దుబాటులో రాజ్యసభ సీట్లను కేటాయించారు. ముగ్గురు అభ్యర్దుల గెలుపునకు కావాల్సిన ఎమ్మెల్యేలను వైసీపీ కేటాయించింది. అదే సమయంలో టీడీపీ పోటీలో ఉన్నా.. అందుకు తగిన విధంగా వ్యూహాలు సిద్ధం చేశారు. ఓటింగ్ లో ప్రాధాన్యతలను ఖరారు చేశారు. ఇక, టీడీపీ చివరి నిమిషంలో పోటీకి దిగితే మినహా.. వైసీపీ ముగ్గురు సభ్యులు ఎన్నికల ఖయంగా కనిపిస్తోంది.

Exit mobile version