Telangana : రాష్ట్రవ్యాప్తంగా గురువారం కురిసిన భారీ వర్షాలతో పాటు పిడుగులు పడి ముగ్గురు మృతి చెందారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు చనిపోయారు. తంగళ్లపల్లి మండలం భరత్ నగర్ కు చెందిన రామడుగు చంద్రయ్య (42) పొలం పనులు చేస్తుండగా పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందాడు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజ్ పల్లికి చెందిన కంబాల శ్రీనివాస్ (40) చింతకాయలు తెంపేందుకు వెళ్లాడు. చెట్టుకింద శ్రీనివాస్ తో పాటు మరో నలుగురు ఉండగా పిడుగుపడింది. శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు.
రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కలకొండ గ్రామానికి చెందిన పసునూరి ప్రవీణాచారి (30) కార్పెంటర్. ఆయన మామతో కలిసి బైక్ పై కడ్తాల్ వెళ్లి వస్తూ వాన రావడంతో వాసుదేవ్ పూర్ గేట్ బస్ షెల్టర్ వద్ద ఆగారు. అదే సమయంలో పిడుగుపడడంతో ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మామ జంగయ్యకు ఎలాంటి గాయాలూ కాలేదు. కానీ, బస్సు షెల్టర్ వద్ద నిలబడిన మాడ్గుల్ కు చెందిన గౌని నిరంజన్ గౌడ్ కు తీవ్రగాయాలయ్యాయి. అతడిని పోలీసులు కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానకు తరలించగా, పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ కు తరలించారు. మరో ఘటనలో మెదక్ జిల్లా రామాయంపేట మండలం డి.ధర్మారంలో జెల్ల యాదగిరి అనే రైతుకు చెందిన ఆవుపై పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందింది.