Kurnool News : మూడు రోజులు కూలీకి..మూడు రోజులు బడికి..టెన్త్ ఫలితాల్లో మెరిసిన పేదింటి బిడ్డ..
Kurnool News : ఆంధ్రప్రదేశ్ లో సోమవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఎంతో మంది మట్టిలో మాణిక్యాలు తమ ప్రతిభ కనబరిచారు. పేదవారైనా మంచి మార్కులు సాధించి అందరి ప్రశంసలు పొందారు. అత్యధిక మార్కులు తెచ్చుకుని ఔరా అనిపించుకున్నారు. బడికి రెగ్యులర్ గా పోకపోయినా మార్కులు మాత్రం దండిగా సంపాదించడం గమనార్హం.
కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలుకు చెందిన ఆంజనేయులు, వన్నూరమ్మకు ఇద్దరు సంతానం. పెద్ద కుమార్తె నవీన పదో తరగతి. కుమారుడు రాజు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. తండ్రి వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. తల్లి కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో నవీన పనులకు వెళ్లక తప్పలేదు. అటు పనులకు వెళ్తూ వారంలో ఓ మూడు రోజులు మాత్రమే పాఠశాలకు వెళ్లేది.
ఆమె పరిస్థితి చూసిన ఉపాధ్యాయులు నవీనను ఎంకరేజ్ చేశారు. నువ్వు మంచి మార్కులు సాధిస్తావని చెప్పడంతో ఆమె చదువుపై శ్రద్ధ చూపింది. అన్ని పుస్తకాలు చదువుకుని మంచి జ్ణానం సంపాదించుకుంది. సోమవారం విడుదలైన పదోతరగతి ఫలితాల్లో 509 మార్కులు సాధించి పలువురి ప్రశంసలు అందుకుంది. అన్ని ప్రభుత్వ పాఠశాలల కన్నా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినిగా గ్రేట్ అనిపించుకుంది.
పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. క్రమశిక్షణ, తపన ఉంటే ఏదైనా సాధించొచ్చు. మోచేతిలో బలముంటే మొండి కొడవలైనా తెగుతుంది. మనలో నేర్చుకోవాలనే జిజ్ణాస ఉంటే ఏదైనా సాధించి తీరుతాం. ఇలా పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన నవీనను పలువురు మెచ్చుకుంటున్నారు. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన స్టూడెంట్ గా రికార్డు కొల్లగొట్టింది.
పదో తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో చదివినా ప్రైవేటుకు దీటుగా మార్కులు కైవసం చేసుకుంది. పేదరికం అడ్డంకిని దాటుకుని మరి అత్యధిక మార్కులు సాధించి ఆదర్శంగా నిలిచింది. తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చింది.