Salaar:ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్ ఈనెల 22న అత్యంత భారీగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాని హోంబలే ఫిలింస్ సంస్థ దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో రూపొందించిందని ప్రచారమవుతోంది. దానికి తగ్గట్టే ఈ చిత్రం దాదాపు 700 కోట్ల మేర ప్రీబిజినెస్ సాగించిందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. 1000 కోట్లు పైగా వసూళ్లను సాధిస్తేనే ఈ చిత్రం విజయం సాధించినట్టు అన్న విశ్లేషణ సాగుతోంది.
అయితే ఈ స్థాయి విజయం సాధించాలంటే సలార్ ముందు ఉన్న సవాళ్ల గురించి కూడా ఆరా తీయాలి. నిజానికి సలార్ రిలీజ్ కి ఒకరోజు ముందే షారూఖ్ ఖాన్ నటించిన డంకీ విడుదలవుతోంది. పఠాన్-జవాన్ లాంటి భారీ విజయాలతో దూకుడుమీదున్న షారూఖ్ హ్యాట్రిక్ పై కన్నేసాడు. రాజ్ కుమార్ హిరాణీ లాంటి అపజయమెరుగని దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అందువల్ల డంకీ ఎఫెక్ట్ ఉత్తరాది బాక్సాఫీస్ వద్ద అంతో ఇంతో ఉంటుందని భావిస్తున్నారు. అయితే ప్రభాస్ కి ఉన్న ఛరిష్మా యాక్షన్ ఇమేజ్ తో ఇండియాలో సలార్ కి భారీ ఓపెనింగులు సాధ్యమవుతాయని భావిస్తున్నారు.
మరోవైపు డంకీతో పాటు, అటు హాలీవుడ్ క్రేజీ సినిమాలు ఆక్వామేన్ 2, 300 దర్శకుడు జాక్ స్నైడర్ రూపొందించిన రెబల్ మూన్
సినిమాలు సలార్ కి పోటీగా మారాయి. ఆక్వామేన్ 2 చిత్రం ఇండియాలోను అత్యంత భారీగా విడుదలకు సిద్ధమవుతుండగా, థియేటర్ల షేరింగ్ కొంత సమస్యాత్మకం. దీనివల్ల సలార్ ఓపెనింగులకు చిల్లు పడటం ఖాయమని భావిస్తున్నారు. ఉత్తరాదిన మెజారిటీ థియేటర్లను షారూఖ్ బ్లాక్ చేస్తుంటే, ఆక్వామేన్ 2 కూడా తన పార్ట్ థియేటర్లను దక్కించుకుంటుంది.
మరోవైపు జాక్ స్నైడర్ రెబల్ మూన్ చిత్రం ట్రైలర్ ఎంతో ఆకట్టుకుంది. ఇప్పటికే ఈ సినిమాపై రివ్యూలు కూడా వచ్చాయి. మిశ్రమ స్పందనలు వ్యక్తమైనా కానీ విజువల్ ఫీస్ట్ గా ఉందంటూ కొందరు ప్రశంసించడంతో నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమాని వీక్షించేందుకు ప్రజలు ఆసక్తిగా ఉన్నారు. ఏది ఏమైనా సలార్ వీటన్నిటినీ అధిగమించి ఓపెనింగు రికార్డుల్ని నమోదు చేయాల్సి ఉంటుంది.