Threatening call : రోజుకో బెదిరింపు కాల్ వస్తుండడంతో ఢిల్లీ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. పెద్ద పెద్ద వ్యాపారులను లక్ష్యంగా చేసుకొని విదేశాల్లోని గ్యాంగ్ స్టర్లు, వారి అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. బిల్డర్లు, స్థిరాస్తి వ్యాపారులు, నగలు, మిఠాయి దుకాణాలు, కార్ల షోరూం యజమానులకు ఎక్కువగా బెదిరింపులు వస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఏడాది అక్టోబరు నాటికే దాదాపు 160 బెదిరింపు కాల్స్ వరకు వచ్చినట్లు వెల్లడించారు.
కొందరు వ్యాపారుల కార్యాలయాలు, ఇళ్లపైనా దుండగులు కాల్పులకు పాల్పడుతుండడంతో వారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని పోలీసులు తెలిపారు. ఇటీవల రోహిణి ప్రాంతంలోని ఓ షోరూంలోకి చొరబడిన దుండగులు గాల్లో కాల్పులు జరిపి, యోగేష్ దహియా, ఫజ్జే భాయ్ లకు రూ.10 కోట్లు ఇవ్వాలని ఓ నోట్ ను అక్కడ పెట్టి వెళ్లారు. మరో కేసులో సంగ్లోయ్ లోని జిమ్ యజమానికి రూ.7 కోట్లు డిమాండ్ చేస్తూ అంతర్జాతీయ నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. దీనిని లారెన్స్ బిష్ణోయ్ సహచరుడు, గ్యాంగస్టర్ దీపక్ బాక్సర్ అనుచరులుగా దుండుగులు చెప్పారని పోలీసులు చెప్పారు. ఇలా బెదిరింపులకు పాల్పడేవారిని పట్టుకునేందుకు ప్రత్యేక సెల్, క్రైమ్ బ్రాంచ్ లు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.