Revanth Sarkar : పేర్ల మార్పు కోసం వేల కోట్ల ప్రజాధనం వృథా.. ఇందుకేనా అధికారం ఇచ్చింది..
Revanth Sarkar : ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల హామీతో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కారు భారీగా ఖర్చు చేస్తోంది. ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా.. పది రోజుల పాటు గ్రామ సభలు ఏర్పాటు చేసి.. ప్రజల నుంచి నేరుగా అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు ఆరు గ్యారెంటీల లోగో, ప్రజాపాలన దరఖాస్తుల ఫారంను విడుదల చేశారు. దానికి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. అదే సమయంలో కొందరు ప్రతిఫలాలు అందుకోలేకపోయారు. దీంతో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. ప్రజాపాలన చేయకుండా ప్రజాధనం వృథా చేస్తున్నారని మండిపడుతున్నారు.
ఇది ఇలా ఉంటే పేర్ల మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం వేల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజాపాలన పేరిట.. ప్రజాధనం వృథా చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహం మార్పుకోసం రూ.996కోట్లు, టీఎస్ నుంచి టీజీగా మార్చడం కోసం రూ.1771కోట్లు, కార్యాలయాల పేర్లు మార్చడం కోసం రూ.461కోట్లు, ఇన్ స్టిట్యూషన్ల పేర్లు మార్చడం కోసం రూ.842కోట్లు, అడ్వర్ టైజేషన్లు, కమ్యూనికేషన్ల పేర్లు మార్పు కోసం రూ.563కోట్లు, పోలీస్ సెక్యూరిటీస్ పేర్ల మార్పుకు రూ.5కోట్లు వెరసి మొత్తంగా ప్రజా పాలన పేరిట 4,639కోట్ల రూపాయలను ప్రజా పాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం వృథా చేస్తోందని విమర్శలు వస్తున్నాయి.
గతంలో కేసీఆర్, జగన్ ఇలానే చేసి ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్నారు. ఇవన్నీ తెలిసి కూడా ప్రజల నుంచి నిరసనలు వెల్లువెత్తడం ఖాయం. ప్రజలు ఏం చేస్తారులే అనుకుంటే..కేసీఆర్ నే గద్దె దించినవాళ్లకు రేవంత్ ను దించడం పెద్ద విషయమేమి కాదు. ఇప్పటికైనా అధికారంలోకి వచ్చేందుకు ఏమేం హామీలు ఇచ్చారో..అన్ని నెరవేర్చేందుకు ప్రయత్నించాలి. అవినీతి, అహంకారం, పక్షపాతం లేకుండా పాలించాలి. అందినకాడికి దోచుకుందామంటే అడ్రస్ లేకుండా పోవడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.