Revanth Reddy : తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం పెద్దగా ఊపందుకోలేదు. కొందరు అభ్యర్థులు ఇప్పటికే ప్రచారంలో బిజీ అయినప్పటికీ నోటిఫికేషన్ తర్వాతనే భారీ బహిరంగ సభలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారం చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు కలిసి ఉంటే ఆ హడావిడి ఓ రేంజ్ లో ఉండేది. కానీ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ లోనే జరగడంతో పెద్దగా సందడి లేదని చెప్పాలి. కానీ రాజకీయ పార్టీలకు మాత్రం ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యే. అందుకే డబుల్ డిజిట్ సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాయి.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ ఎంపీ సీట్లపై ఇంకా ప్రతిష్టంభన వీడడం లేదు. 17 స్థానాలకు గానూ 14 స్థానాలకే అభ్యర్థులను ఖరారు చేసినా.. మరో మూడు స్థానాలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. గురువారం సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లడంతో పెండింగ్ సీట్లపై క్లారిటీ వస్తుందనే ప్రచారం జరుగుతోంది.
ఢిల్లీ పర్యటనలో పెండింగ్ సీట్లపై పార్టీ హైకమాండ్ తో రేవంత్ చర్చించే అవకాశం ఉంది. ఈ పర్యటన తర్వాత మూడు స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా హైదరాబాద్ విషయంలో కాంగ్రెస్ పెద్దగా ఆలోచించడం లేదు. అలాగే మాదిగ సామాజికవర్గానికి ఒక్క టికెట్ కూడా ఇవ్వకపోవడంతో ఆ సామాజికవర్గం కాంగ్రెస్ పై గుర్రుగా ఉంది. దీంతో హైదరాబాద్ నుంచి మాదిగ సామాజిక వర్గానికి టికెట్ కేటాయిస్తే ఎలా ఉంటుందన్న అంశంపై పార్టీ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన రెండు నియోజకవర్గాలపైనే కాంగ్రెస్ ఎటు నిర్ణయం తీసుకోలేకపోతోంది. కరీంనగర్ టికెట్ బీసీ అభ్యర్థికి ఇవ్వాలని డిమాండ్లు వస్తుండగా.. ప్రవీణ్ రెడ్డి తనకు ఇవ్వాలని పట్టుబడుతుండడం కాంగ్రెస్ కు తలనొప్పిగా మారింది.
ఖమ్మం ఎంపీ టికెట్ భట్టి విక్రమార్క తన సతీమణికి ఇవ్వాలని.. పొంగులేటి తన సోదరుడికి ఇవ్వాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే తుమ్మల నాగేశ్వరరావు వ్యూహాత్మకంగా మండవ వెంకటేశ్వరరావును తెరపైకి తెచ్చారు. కమ్మ సామాజిక వర్గానికి ఒక్క టికెట్ ఇవ్వలేదని, దీంతో ఖమ్మం నుంచి తన స్నేహితుడు మండవకు ఇవ్వాలని కోరుతున్నారు తుమ్మల. దీంతో ఈ మూడు స్థానాలపై రేవంత్ తాజా ఢిల్లీ టూర్ తోనైనా స్పష్టత వస్తుందా? ఇంకా మరికొన్ని రోజుల పాటు నాన్చుతారా? అని పార్టీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కువ సీట్లు గెలుచుకుని రాహుల్ కు గిఫ్ట్ ఇద్దామనుకుంటున్న రాష్ట్ర నాయకత్వం ఆశలు నెరవేరాలంటే వేగంగా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.