Manchu Manoj : సినీ నటుడు మంచు మనోజ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తండ్రి మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మనోజ్ రాజకీయాల గురించి మాట్లాడారు. మనోజ్ ఫలానా వ్యక్తికి ఓటు వేయ్యండి..వేయొద్దు అని చెప్పకుండా రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించారు. ఎన్నికలలో పదిమందిని కలుపుకుని ముందుకు వెళ్లే నాయకుడిని వెతకండి, అలాగే అవగాహనతో సరైన లీడర్ ను ఎన్నుకోండి అని మనోజ్ చెప్పారు.
కొందరు నాయకులు వాళ్ల కుటుంబానికి, చుట్టుపక్కల వాళ్లకు సాయం చేయడం లేదు. అలాంటి నాయకులు ఇంకా ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. ఓటు వేసేటప్పుడు ఈ అంశాలను గుర్తు పెట్టుకుని ఏ నాయకుడికి ఓటేస్తే పేదలకు న్యాయం జరుగుతుందో వారికే ఓటు వేయండి అని అన్నారు. డబ్బులు ఇస్తే తీసుకోండి.. ఓటు మాత్రం మీకు నచ్చిన వాళ్లకు మాత్రమే వేయాలని కోరారు.
మనోజ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని ఉద్దేశించే మనోజ్ కామెంట్స్ చేశారని టీడీపీ, జనసేన కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. జగన్ తన ఇంట్లోనే న్యాయం చేయలేకపోయారని.. ఇప్పుడు ఇదే విషయాన్ని మనోజ్ సైతం చెప్పారని వారు అంటున్నారు. దీంతో వైసీపీ సోషల్ మీడియా మనోజ్ పై విమర్శలకు దిగింది. పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన మంచు హీరో వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగారు. తాను ఏ పార్టీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని, తన మాటలను ఏ పార్టీకి ఆపాదించవద్దని కోరారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధంలేదని, అన్ని పార్టీల్లో తన శ్రేయోభిలాషులు ఉన్నారని చెప్పుకొచ్చారు.