Pawan Kalyan : ఏపీలో మరో రెండు, మూడు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. దీని కోసం వైసీపీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించుకుంటూ వెళ్తోంది. జగన్ రెడ్డిని గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ జట్టుకట్టారు. అయితే పొత్తులో భాగంగా సీట్ల వ్యవహారం ఇంకా తేల్చడం లేదు. నోటిఫికేషన్ వచ్చాకనే ప్రకటిస్తామని అంటున్నారు. జగన్ అభ్యర్థుల ప్రకటన పూర్తయిన తర్వాత వారికి దీటైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకే వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది.
అయితే పొత్తు ఉన్నప్పటికీ చంద్రబాబు రెండు నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించడంపై జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. దీనిపై పవన్ ఏ వ్యాఖ్యలు చేయకపోవడంతో వారు నిరుత్సాహంలో ఉన్నారు. టీడీపీ సీట్ల ప్రకటనపై జనసేనాని తాజాగా మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో గణతంత్ర వేడుకల్లో భాగంగా పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
మండపేట, అరకు నియోజకవర్గాల్లో చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించడాన్ని తప్పుపట్టారు. పొత్తు ధర్మం ప్రకారం ఏకపక్షంగా ప్రకటించకూడదన్నారు. ‘బలం ఇచ్చే వాళ్లం అవుతున్నాం కానీ తీసుకునేవాళ్లం ఆపలేకపోతున్నాం.. ఇద్దరు వ్యక్తులను కలపడం కష్టం. కానీ విడదీయడం తేలిక. ఒంటరిగా పోటీ చేస్తే కొన్ని స్థానాలు వస్తాయి.. కానీ అధికారంలోకి వస్తామో లేదో తెలియదు.. అందుకే పొత్తులకు వెళ్లాం’’ అని అన్నారు.
పొత్తు ధర్మాన్ని పాటించకుండా టీడీపీ రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది కాబట్టి తాము కూడా రెండు స్థానాలను ప్రకటిస్తామన్నారు. రాజోలు, రాజానగరంలో పోటీ చేస్తున్నామని వెల్లడించారు. చంద్రబాబు లాగే తనకు ఒత్తిడి ఉందని..అందుకే రెండు నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటిస్తున్నా.. పొత్తుల్లో ఒక మాట అటూ ఇటూ ఉన్నా.. రెండు పార్టీలు కలిసే ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పుకొచ్చారు.
రాజకీయాల్లో ఆటుపోట్లు ఎదురైనప్పటికీ ముందుకెళ్లాలని పవన్ కల్యాణ్ శ్రేణులకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. టీడీపీతో పొత్తులో భాగంగా మూడో వంతు సీట్లు తీసుకుంటున్నామని పార్టీ నేతలకు క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలతో ఆగిపోవడం లేదని, భవిష్యత్తులోనూ పొత్తు కొనసాగుతుందని వెల్లడించారు. లోకేశ్ సీఎం పదవిపై మాట్లాడినా తాను పట్టించుకోలేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం మౌనంగా ఉన్నానని చెప్పారు.