Southwest Monsoon : వారం కిందటి దాక ఎండలు మండిపోయాయి. ఎన్నడూ లేనంతగా జనాలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఇక గత వారం నుంచి వర్షాలు కురుస్తూ ఒక్కసారిగా వాతావరణాన్ని చల్లబరిచాయి. అయితే ఈ ఏడాది వర్షాలు ఎలా ఉంటాయనేదానిపై దేశ ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ ఇచ్చింది.. ఇంకొన్ని రోజుల్లోనే నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులను తాకనున్నాయి. కేరళను ఎప్పుడు తాకుతాయో.. వాతావరణశాఖ చెప్పింది. ఎండలతో అల్లాడిపోతున్న దేశ ప్రజలకు.. నైరుతి రుతుపవనాల విషయంలో గుడ్ న్యూస్ వచ్చినట్లు అయింది. భారత వాతావరణశాఖ ఐఎండీ. నైరుతి రుతుపవనాలు.. మే 22కు బదులు.. మే 19నే దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులతో పాటు ఆగ్నేయ బంగాళాఖాతంలోని పలు ప్రాంతాలను తాకుతాయని వెల్లడించింది. జూన్ 1న.. కేరళను నైరుతి రుతుపవనాలు తాకుతాయని చెప్పింది. అంటే ఇంకొన్ని రోజుల్లో నైరుతి రుతుపవనాలు.. కేరళను తాకుతాయని, జులై 15 నాటికి దేశవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉంటుందని ఐఎండీ ప్రకటించింది.
జూన్ నుంచి – సెప్టెంబర్ వరకు వర్షాకాలం.. దేశానికి ఈ సమయం చాలా ముఖ్యం. గతేడాది.. జూన్ రెండో వారం వరకు.. నైరుతి రుతుపవనాలు కేరళను తాకలేదు. ఇందుకు కారణం ఎల్నీనో. కానీ ఇప్పుడు.. జూన్ 1 నాటికే, అంటే సాధారణ సమయానికే నైరుతి రుతుపవనాలు.. కేరళను తాకుతాయంటుండటం శుభవార్తే.
నైరుతి రుతుపవనాలు అంటే ఏంటి?
భారత్ లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నైరుతి దిశగా అంటే అరేబియా సముద్రం మీదుగా హిమాలయాల వైపు గాలులు వీస్తాయి. ఈ గాలులే నైరుతి రుతుపవనాలు. అక్టోబరులో ఈ గాలులు వ్యతిరేక దిశలో వీస్తాయి. అవి ఈశాన్య రుతుపవనాలు. వీటి కారణంగా దక్షిణ భారతదేశంలో అక్టోబరు నుంచి డిసెంబర్ మధ్యలో వానలు కురుస్తాయి. సముద్రంపై ఉష్ణోగ్రత భూమిపై కన్నా కొంచెం చల్లగా ఉంటుంది. ఆ సమయంలో సముద్రంపై నుంచి గాలులు వీచడం మొదలవుతుంది. ఈ గాలులు తమతోపాటు సముద్రపు ఆవిరిని కూడా తీసుకురావడంతో అది వానగా మారుతుంది.