Prashant Kishore : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13న ఎన్నికలు ముగిశాయి. వచ్చే నెల నాలుగో తేదీన ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు. ఫలితాలు ఎలా ఉంటాయోనని ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ నెలకొంది. ఈ సారి ఎన్నికల పోరు రసవత్తరంగా ఉంది. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని పార్టీలు తహతహలాడుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని కూటమికి చెందిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు చెబుతున్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 2019 ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు తమ పార్టీ సాధించి తీరుతుందని ధీమాను వ్యక్తం చేశారు. 151కిపైగా అసెంబ్లీ సీట్లు.. 22 వరకు ఎంపీ సీట్లు గెలవడం ఖాయమన్నారు. అంతేకాదు వైసీపీ నేతలు ఏకంగా జూన్ 9న సీఎం జగన్ రెండోసారి సీఎం కావడం పక్కా అంటున్నారు. ఏకంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసేందుకు వేదికను కూడా రెడీ చేసే ఆలోచనలో ఉన్నారు. అయితే జగన్ ఐప్యాక్ ఆఫీసుకు వెళ్లిన సమయంలో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టాపిక్ తెచ్చారు. ఏపీ ఎన్నికల ఫలితాలు గతంలో ప్రశాంత్ కిషోర్ సాధించిన వాటికన్నా ఎక్కువగా ఉంటాయన్నారు.
దీంతో సీఎం జగన్ వ్యాఖ్యల తర్వాత ప్రశాంత్ కిషోర్ ఏపీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం తప్పదంటూ జోస్యం చెప్పారు. ఓ ప్రముఖ జర్నలిస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము ఎన్నికల్లో గెలవబోతున్నట్లు సీఎం జగన్ చెబుతున్నట్లుగానే అటు అమిత్ షా, రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ కూడా చెబుతున్నారన్నారు. తాను పదేళ్లుగా ఎన్నికల్లో పనిచేస్తున్నానని.. ఫలితాల ముందే ఓటమిని అంగీకరించిన నేతలు ఎవరూ తనకు ఇప్పటి వరకు కనిపించలేదంటూ వ్యాఖ్యానించారు.
జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపులో నాలుగు రౌండ్లు తర్వాత కూడా కచ్చితంగా చూడండి. వచ్చే రౌండ్లలో తమకు అత్యధిక మెజార్టీ ఖాయమని, ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ గొప్పాలు పోతారంటూ చెప్పుకొచ్చారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు తాము ఏపీలో అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారని.. జగన్ మాత్రం అలా కాకుండా.. గత ఎన్నికల కంటే ఈ సారి ఎక్కువ సంఖ్యలో సీట్లు గెలుస్తామన్న మాటలను గుర్తు చేశారు. ఈ గెలుపు ఓటములపై చర్చకు అంతం ఉందన్నారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీకి గతం కంటే సీట్లు తగ్గవన్నారు. దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ, బీజేపీలపై అసంతృప్తి మాత్రమే ఉందని.. ఆగ్రహం లేదన్నారు. అందుకే ఈసారి బీజేపీ 2019లో ఉన్న సీట్లకు సమానంగా కానీ.. అంతకంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని పీకే వివరించారు.