AP News : ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ సారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని అన్ని పార్టీ శాయశక్తులా కృషి చేశాయి. జూన్ 4న పార్టీల భవిష్యత్ ఏంటో తేలనుంది. ఈ సారి ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో గత ఎన్నికల్లో కంటే భారీగా నగదు, లిక్కర్, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఈసారి ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పట్టుబడ్డ సొమ్ము, మద్యం, మత్తు పదార్థాల వివరాలను ఏపీ పోలీసు శాఖ ఇటీవల వెల్లడించింది.
ఈ మేరకు బుధవారం ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. గతంలో జరిగిన 2019 ఎన్నికలతో పోల్చుకుంటే 2024లో భారీగా మద్యం, డ్రగ్స్ పట్టుబడ్డట్లు పోలీసులు తెలిపారు. పొరుగరాష్ట్రాలైన ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, పాండిచ్చేరి సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. 150 సరిహద్దు చెక్ పోస్ట్‌ల్లో పోలీస్, సెబ్, వాణిజ్య పన్నుల శాఖ, రెవెన్యూ, రవాణా శాఖలు సంయుక్తంగా దాడులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 35 మొబైల్ పెట్రోలింగ్ పార్టీలు, 15 తాత్కాలిక చెక్ పోస్ట్ లలో అణువణువుగా నిఘా పెట్టి వీటిని పట్టుకున్నట్టు ఏపీ పోలీసు శాఖ వెల్లడించింది. ఈ ఎన్నికల్లో మొత్తంగా 3466 వాహనాలను సీజ్ చేశారు. 2019 ఎన్నికల్లో రూ.41.80 కోట్లు స్వాధీనం చేసుకోగా.. 2024 ఎన్నికల్లో రూ.107.96 కోట్లను సీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 7305 మందిని అరెస్ట్ చేశారు. ఇక, 2019 ఎన్నికల్లో రూ.8.97 కోట్ల విలువైన మద్యాన్ని సీజ్ చేయగా.. 2024 ఎన్నికల్లో రూ.58.70 కోట్ల విలువైన మద్యాన్ని పట్టుకున్నారు. 2019 ఎన్నికల సందర్భంగా రూ.5.04 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేయగా.. 2024 ఎన్నికల్లో రూ. 35.61 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేశారు. ఈ కేసుల్లో 1730 మందిని అరెస్ట్ అరెస్ట్ చేశారు. 2019 ఎన్నికల్లో రూ.27.17 కోట్లు సీజ్ చేయగా.. 2024 ఎన్నికల్లో రూ.123.62 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంలో 42 మందిని అరెస్ట్ చేశారు. 2019 ఎన్నికలలో రూ.10.63 కోట్ల విలువైన ఉచితంగా పంపిణీ చేసే వస్తువులు సీజ్ చేయగా, 2024 ఎన్నికల్లో రూ. 16.98 కోట్లు విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుని 233 మందిని అరెస్ట్ చేశారు.