Pawan Kalyan : పోయిన చోటే వెతుక్కోవాలని పెద్దలు చెప్పిన మాటను నిజం చేస్తూ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనాని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భారీ విజయం సాధించారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన ఆయన ఈసారి మాత్రం బంపర్ మెజారిటీతో గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు. అలాగే పవన్ నేతృత్వంలో జనసేన తరఫున పోటీచేసిన 21 మంది అభ్యర్థులు కూడా ఘన విజయం సాధించారు. ఎంపీ సీట్లలో కూడా పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ జనసేననే గెలిచింది. మొత్తానికి 100 శాతం స్ట్రైక్ రేట్ తో జనసేన చరిత్ర సృష్టించింది. ఇక పిఠాపురం నుంచి ఏకంగా 70 వేల మెజారిటీతో గెలుపొందిన పవన్ కల్యాణ్ కు దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెతుతున్నాయి. చిరంజీవి, చరణ్, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్, ఉపాసన, నాగబాబు, పవన్ సోదరీమణులు.. ఇలా మెగా ఫ్యామిలీ అంతా ఫుల్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తనకు తిరుగలేని విజయం కట్టబెట్టిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ‘నా జీవితంలో ఇప్పటి వరకు విజయం అంటే ఏమిటో తెలియదు. ఎప్పుడో సినిమాల్లో ఉన్నప్పుడు తొలిప్రేమ సినిమా సక్సెస్ అందించింది. నా జీవితమంతా దెబ్బలు తినడం, మాటలు, అవమానాలు పడటమే జరిగింది. పరాజయాన్ని చూసి భయపడను. ఓటమి నాకు ఉత్సాహాన్ని ఇస్తుంది. దేనికంటే.. చిన్నప్పుడు ధర్మో రక్షిత రక్షిత: అన్నది నేర్చుకొన్నాను. ధర్మం కోసం నిలబడితే.. ధర్మ మనకోసం నిలబడింది. కనిపించని పరాశక్తి, దేవుళ్లకు, పిఠాపురం ప్రజలకు మనస్పూర్తిగా కృతజ్నతలు తెలియజేసుకొంటున్నాను. అండగా నిలిచిన యువతకు, ఆడబిడ్డలకు, టీడీపీ నేతలకు, నాయకులకు థ్యాంక్స్ చెప్పుకొంటున్నాను అన్నారు. పిఠాపురంలో గెలిపించి మరింత బలం ఇచ్చారు. ఓడిపోతే నిలబడ్డాను. ఆకాశమంతా ధైర్యం అందించారు. మీ ప్రేమను గుండెల్లో పెట్టుకొంటాను. మీ కష్టాల్లో ఒకడిని అవుతాను. మీ ఇంట్లో ఒక్కడిగా ఉంటాను. మీ కోసం, మీ శ్రేయస్సు కోసం అసెంబ్లీలో అడుగుపెడుతున్నాను’ అని పవన్ ఉద్వేగభరితమయ్యారు.