JAISW News Telugu

ICC U-19 World Cup 2024 : కుర్రాళ్ల క్రికెట్ నేటినుంచే..అండర్ -19 వరల్డ్ కప్ షెడ్యూల్ ఇదీ..

ICC U-19 World Cup 2024

ICC U-19 World Cup 2024

ICC U-19 World Cup 2024 : వన్డే ప్రపంచకప్ ను మరువక ముందే మరో ప్రపంచకప్ సమరం మన ముందుకొచ్చింది. భవిష్యత్ స్టార్లను తయారు చేసే అండర్ -19 వన్డే ప్రపంచ కప్ నేటి నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ ప్రపంచ కప్ కు దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇవ్వబోతోంది. కుర్రాళ్ల సత్తాకు పరీక్షగా ఈ టోర్నీ సాగబోతోంది. ప్రతిష్ఠాత్మక ఈ ప్రపంచ కప్ లో భారత్ రికార్డు స్థాయిలో 5 సార్లు విజేతగా నిలిచి మరోసారి ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది.

యువరాజ్ సింగ్ (2000), రోహిత్ శర్మ(2006), విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా(2008), రిషబ్ పంత్, ఇషాన్ కిషన్(2016), శుభమన్ గిల్ (2018) వంటి స్టార్ ఆటగాళ్లను భారత జట్టుకు అందించిన చరిత్ర అండర్-19 ప్రపంచకప్ కు సొంతం.

ప్రస్తుత టోర్నీలో పంజాబ్ కుర్రాడు ఉదయ్ సహరన్ సారథ్యంలో పోటీపడుతున్న భారత్ యువ జట్టుపై ఈ సారి కూడా భారీ అంచనాలు ఉన్నాయి. తెలంగాణ నుంచి భారత అండర్ -19 జట్టుకు ఎంపికైన అరవెల్లి అవనీశ్ రావు, మురుగన్ అభిషేక్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

మొత్తం 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ దశలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన 12 జట్లు సూపర్ సిక్స్ కు అర్హత సాధిస్తాయి. 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించి మ్యాచ్ లు ఆడిస్తారు. తొలి రెండు స్థానాల్లో నిలిచిన నాలుగు జట్లు సెమీ ఫైనల్ కు అర్హత సాధిస్తాయి. ఫిబ్రవరి 11న ఫైనల్ జరుగుతుంది. శనివారం బంగ్లాదేశ్ మ్యాచ్ తో భారత్ తన పోరాటాన్ని ప్రారంభిస్తుంది. శుక్రవారం ఆరంభ మ్యాచ్ లో ఐర్లాండ్ తో అమెరికా, దక్షిణాఫ్రికాతో వెస్టిండీస్ తలపడనున్నాయి. ఈ టోర్నీలో భారత్ 2000,2008, 2012, 2018, 2022లో విజేతగా నిలిచింది.

గ్రూప్- ఏ : భారత్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, అమెరికా
గ్రూప్- బీ : ఇంగ్లాండ్, స్కాట్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్
గ్రూప్- సీ : అస్ట్రేలియా, నమీబియా, శ్రీలంక, జింబాబ్వే
గ్రూప్-డీ : ఆఫ్గానిస్థాన్, నేపాల్, న్యూజిలాండ్ , పాకిస్థాన్

Exit mobile version