Indian Doctors : భారతీయులకు అమెరికాతో అవినాభావ సంబంధం ఉంది. భారతీయులు చదువు, ఉద్యోగాలకు వెళ్లడానికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చే దేశం అమెరికా. దశాబ్దాలుగా ఎంతో మంది భారతీయులు అమెరికాలో స్థిరపడుతున్నారు. అమెరికాలో వీరిని ఇండియన్స్ లేదా అమెరికన్ ఇండియన్స్ అని పిలుస్తారు. యూఎస్ జనాభాలో భారతీయులు 4.9 మిలియన్ల కంటే ఎక్కువగా ఉన్నారు. ఇది దాదాపు అమెరికా జనాభాలో 1.35శాతం.
భారత్ లో ఐటీ పరిశ్రమ వృద్ధి చెందిన తర్వాత 1990 తర్వాత ఎంతో మంది యువత అమెరికాను తమ కలల సౌధంగా భావించుకుంటూ వచ్చారు. పంజాబ్, ఏపీ, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్, కర్నాటక, కేరళ, తమిళనాడు నుంచి వేలాదిగా తరలివెళ్తున్నారు. వివిధ రంగాల్లో అమెరికాలో స్థిరపడి తాము ఎదగడమే కాకుండా ఆ దేశ వృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు.
అమెరికా ఆరోగ్యం రంగంలో భారతీయ వైద్యుల పాత్ర ఎనలేనిది. ఆ దేశంలోని ప్రతీ ఐదుగురు డాక్టర్లలో ఒకరు భారతీయులే. వారు చట్టాలకు లోబడి ఉంటారు.. వారు యుఎస్ యొక్క ఉత్తమ పౌరులని అక్కడి వారు మెచ్చుకుంటుంటారు. భారతీయుల్లో సహజంగా ఉన్న మంచి ఆచార వ్యవహారాలు, కష్టించి పనిచేసేతత్వం, ఎదుటి వారితో ప్రవర్తించే తీరు, మానవతా దృక్పథం.. అమెరికా పౌరులను ఆకట్టుకుంటోంది. అందుకే భారతీయులను అమెరికన్లు చాలా గౌరవ ప్రదంగా చూస్తారు.
అమెరికాలో భారతీయ వైద్యుల కృషిని ఓ అమెరికా వ్యక్తి పొగుడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అమెరికా సమాజంలో 1శాతం ఉన్న భారతీయులు 6శాతం పన్నులు కట్టడం వారి నిజాయితీకి మచ్చుతునక అని చెప్పారు. అమెరికా బెస్ట్ సిటిజన్స్ గా భారతీయులని చెప్పుకోవచ్చు అని అన్నారు. దీంతో ఇది కదా మన భారతీయుల ప్రతిభ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ‘‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా.. పొగడరా నీ తల్లి భూమి భారతిని’’ అన్నట్టుగా భారతీయ వైద్యులు తమ విశేష సేవలను అందిస్తూ పుట్టిన గడ్డకు పేరు తీసుకరావడం నిజంగా గొప్ప విషయం.