Sukumar-Buchi Babu : సినిమాల్లో అవకాశాలు రావాలంటే అంతా ఈజీ కాదు.. ఎవరో ఒకరి అండ లేకుండా ఎదగాలంటే చాలా కష్టం. నటులకే కాదు టెక్నిషియన్స్ కూడా గురువు ఉండాల్సిందే. నటుల కన్నా వీరికే మార్గదర్శకత్వం ఎక్కువ అవసరముంటుందనే చెప్పవచ్చు. ఒకప్పుడు బాలీవుడ్ ను శాసించిన వర్మ..తన ఆర్జీవీ ఫ్యాక్టరీ కింద వందల సంఖ్యలో డైరెక్టర్లు, సినిమాటోగ్రాఫర్లు, సంగీత దర్శకులు, ఇతర డిపార్ట్ మెంట్ వాళ్లను తయారు చేశారు.
ఇప్పుటి దర్శకుల్లో సుకుమార్ సైతం ఎంతో మంది శిష్యులను సొంత కాళ్ల మీద నిలబెట్టేలా వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. కొందరిని సొంత సంస్థ ద్వారా పరిచయం చేస్తే.. మరికొందరిని ఇతర సంస్థల ద్వారా అవకాశాలు ఇప్పిస్తున్నారు. అలా దర్శకులుగా మారిన శిష్యులు ఆయన పేరు నిలబెడుతున్నారు. వారందరిలో ఎక్కువ పేరు తెచ్చి పెట్టింది మాత్రం బుచ్చిబాబు సానానే అని చెప్పవచ్చు. చిన్న సినిమాగా వచ్చిన ‘ఉప్పెన’ ఏకంగా వంద కోట్లు రాబట్టింది. తొలి సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో బుచ్చిబాబు ప్రతిభ అందరికీ తెలిసివచ్చింది. దీంతో ఏకంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా అవకాశం తెప్పించింది.
‘పెద్ది’ అనే టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమాను బుధవారమే ముహూర్తం షాట్ తీశారు. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ తో కలిసి సుకుమార్ నిర్మిస్తున్నారు. ఉప్పెనలో కూడా ఆయన నిర్మాణ భాగస్వామే. చరణ్ తో బుచ్చిబాబు సినిమా కథ చర్చలు జరిగేటప్పుడు తనకు షాకులు మీద షాకులు ఇచ్చాడని సుకుమార్ ప్రారంభోత్సవ వేడుకలో చెప్పడం విశేషం.
ఉప్పెన తర్వాత మళ్లీ ఏదో చిన్న సినిమా చేస్తాడు అనుకుంటే రామ్ చరణ్ హీరోగా సినిమా చేయాలని భావిస్తున్నట్టు చెప్పడంతో తాను మొదట షాక్ కు గురయ్యాయని తెలిపారు. సంగీత దర్శకుడిగా ఎవరినీ అనుకుంటున్నవంటే ఏఆర్ రహమాన్ పేరు చెప్పి మరో షాక్ ఇచ్చాడని చెప్పారు. తానే ఇంతవరకు రహమాన్ తో మ్యూజిక్ చేయించలేదని, కానీ రెండో సినిమాతోనే రహమాన్ రేంజ్ కు బుచ్చి వెళ్లిపోయాడని అన్నారు. ఆ తర్వాత హీరోయిన్ గా ఎవరంటే జాన్వీ కపూర్ కావాలని చెప్పి మరో షాక్ ఇచ్చాడన్నారు. ఇలా బుచ్చిబాబు తనకు వరుస షాక్ లు ఇచ్చాడని చెప్పుకొచ్చారు. కథలో దమ్ము ఉండడంతో వారినందరినీ ఒప్పించగలిగామని, బుచ్చిబాబుకు ఉన్న కమిట్ మెంట్ తోనే ఇవన్నీ చేయగలిగాడు అని సంతోషంగా శిష్యుడిని అభినందించారు.