Pawan and Balakrishna : ఇటీవల మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపాయి. రాజకీయ.. సినీ ప్రముఖులు సురేఖ వ్యాఖ్యల పై మండిపడ్డారు. టాలీవుడ్ ప్రముఖులు సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. దీంతో, సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. కానీ, సినీ ప్రముఖులు మాత్రం శాంతించలేదు. ఆమె చేసిన వ్యాఖ్యలపై ఇండస్ట్రీ మొత్తం ఏకతాటి పైకి వచ్చి ఖండించారు. అయితే ఈ వ్యవహారం పైన ఇప్పటి వరకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్, బాలకృష్ణ స్పందించకపోవటం చర్చనీయాంశంగా మారింది. ఇండస్ట్రీకి పెద్ద దిక్కులా ఉండాల్సిన పవన్ ఎందుకు స్పందించలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.
అక్కినేని ఫ్యామిలీ, నటి సమంత పైనా అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై సినీ ప్రముఖులు భగ్గుమన్నారు. ఒక్క తెలుగు ఇండస్ట్రీనే కాకుండా తమిళ, మలయాళ ఇండస్ట్రీలతోపాటు బాలీవుడ్ సినీ తారలు సైతం కొండా సురేఖ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ తారల జోలికి రావొద్దంటూ తీవ్రంగా హెచ్చరించారు. చిరంజీవితోపాటు మెగా ఫ్యామిలీ తారలందరూ స్పందించినా.. పవన్ కళ్యాణ్ మాత్రం స్పందించలేదు. అత్తారింటికి దారేది సినిమాలో తన సహనటిగా ఉన్న సమంతపై వాఖ్యలను ఇకనైనా ఆయన ఖండిస్తారేమోనని వారంతా ఆశించారు.
హైడ్రా కూల్చివేతలపై స్పందించిన తరహాలోనే దీనిపైనా స్పందిస్తారని అంతా భావించారు. ఒక రాజకీయ నేతగా కాకపోయినా.. సినీ ప్రముఖుడిగా అయినా రియాక్ట్ అవుతారని అనుకున్నారు. తిరుపతిలో జరిగిన వారాహి సభలో నైనా ఆయన ఈ అంశంపై మాటవరసకైనా మాట్లాడుతారేమోనని అనుకున్నారు. సాధారణంగా మహిళా అభ్యున్నతి, గౌరవమర్యాదల గురించి పవన్ గట్టిగా స్పందిస్తారు. కానీ, ఈ విషయంలో మాత్రం ఎక్కడా మాట్లాడలేదు. ఆయన మౌనంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో కొండా సురేఖ వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ ఘాటుగా స్పందించారు. నేరుగా మంత్రి పేరును ప్రస్తావిస్తూ గట్టిగా సమాధానం ఇచ్చారు.
నందమూరి బాలకృష్ణ కూడా మంత్రి సురేఖ వ్యాఖ్యలను ఎక్కడా ఖండించలేదు. వాస్తవానికి నందమూరి, అక్కినేని కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అక్కినేని కుటుంబం పై చేసిన వ్యాఖ్యలపై స్పందించకపోవడం ఏంటనే చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డితో ఉన్న సఖ్యత వల్లే బాలకృష్ణ స్పందించలేదా.. లేక ఏఎన్నార్ కుటుంబంతో ఉన్న గ్యాప్ కారణంగానే మాట్లాడలేదా అన్న చర్చ సోషల్ మీడియాలో కొనసాగుతోంది. అయితే, ఈ వివాదానికి ముగింపు పలకాలని టీపీసీసీ చీఫ్ మహేష్ టాలీవుడ్ ను కోరారు. కానీ, ఇప్పటికీ సురేఖ వ్యాఖ్యల పైన వివాదం రాజుకుంటూనే ఉంది.