Chandrababu Naidu : తెలుగు నాట చరిత్రను లిఖించబోతున్న చంద్రబాబు రాజకీయ ప్రయాణం ఇదీ!

Chandrababu Naidu

Chandrababu Naidu Political Journey

Chandrababu Naidu : నాలుగో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు రాజకీయ ప్రయాణం అంతా ఆసక్తికరమే. విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నో మైలు రాళ్లు దాటారు. చంద్రబాబు రాజకీయ జీవితంలో పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండుసార్లు, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక సారి కలిపి మొత్తం మూడు పర్యాయాలు సీఎంగా పనిచేశారు. నాలుగు దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన లేని రాజకీయాలు లేవు. చంద్రబాబు తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చదివే రోజుల్లోనే రాజకీయాల వైపు మొగ్గు చూపారు. అప్పటి ఎమ్మెల్సీ రాజగోపాల్ నాయుడి ప్రోత్సాహంతో రాజకీయాల్లో అడుగుపెట్టాడు. ఎన్‌జీ రంగా అనుచరుడిగా రాజకీయాల్లోకి వచ్చారు.

1975లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1978లో తొలిసారి చంద్రబాబు అసెంబ్లీకి పోటీ చేశారు. ఎమర్జెన్సీ తర్వాత  1980లో జరిగిన ఎన్నికల్లో ఇందిర కాంగ్రెస్ తరఫున చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీచేశారు. పట్టాభిరామ చౌదరిపై 2వేల 494 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అలా తొలిసారి అసెంబ్లీలో చంద్రబాబు అడుగుపెట్టారు. టంగుటూరి అంజయ్య కేబినెట్‌లో మంత్రి అయ్యారు. సాంకేతిక విద్య, పశు సంవర్థక, పాడి పరిశ్రమ, మైనర్‌ ఇరిగేషన్‌తో పాటు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా పనిచేశారు.

అప్పుడే ఎన్టీఆర్‌తోనూ పరిచయం ఏర్పడింది. అనంతరం ఎన్టీఆర్ చిన్న కుమార్తె భువనేశ్వరితో వివాహమైంది. ఆ తర్వాత కొన్ని నెలలకు 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించగా.. చంద్రబాబు వెంటనే అందులో చేరలేదు. కాంగ్రెస్‌లోనే ఉన్నారు. టీడీపీ తొలిసారి పోటీ చేసినప్పుడు 1983లో జరిగిన ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి మేడసాని వెంకట రామనాయుడి చేతిలో ఓడిపోయాడు. ఆ తర్వాత చంద్రబాబు టీడీపీలో చేరారు.  1984లో టీడీపీ అధికారం కోల్పోయింది.  

1984లో ఎన్టీఆర్ వైద్యం కోసం అమెరికా వెళ్లినప్పుడు నాదెండ్ల భాస్కరరావు కొందరు ఎమ్మెల్యేల మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. 1985లో వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేయకుండా టీడీపీ కోసం పనిచేశారు. 1986లో టీడీపీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 1989లో చంద్రగిరి నియోజకవర్గాన్ని వీడి కుప్పం బరిలో నిలిచి విజయం అందుకున్నారు. అప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్టీఆర్ చంద్రబాబును నియమించారు. ఆ తర్వాత1994 ఎన్నికల్లో టీడీపీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది.  చంద్రబాబు ముఖ్యమంత్రిగా తన మార్క్ పాలన సాగించారు.

అంతర్జాతీయంగా పేరు ప్రతిష్టలు తెచ్చుకుని.. ఉత్తమ సీఎంగా రికార్డుకెక్కారు. 1996లో యూనైటెడ్ ఫ్రండ్ ఏర్పాటు చేశారు. అలా నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు.. 1999లో సొంతంగా ఎన్నికల బరిలోకి దిగారు. బీజేపీ మద్దతుతో 178 స్థానాలను అందుకుని రెండో సారి సీఎం అయ్యారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఆ తర్వాత 2004, 2009లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. 2014లో రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. నవ్యాంధ్ర తొలి సీఎంగా చంద్రబాబు ఐదేళ్లు పాలన సాగించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లు సాధించగా.. 23 స్థానాలకే టీడీపీ పరిమితమైంది. ఇక తాజా ఎన్నికల్లో  జనసేన, బీజేపీతో కలిసి టీడీపీ భారీ విజయం నమోదు చేసింది. 2024లో నాలుగోసారి ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టి చరిత్రను లిఖించబోతున్నారు.

TAGS