Tirumala : తిరుమలలో సాక్షాత్తు కుమారస్వామి అడుగుపెట్టిన ప్రదేశం ఇదే..
Tirumala : తిరుమల శేషాద్రి కొండలు ఎంతో పవిత్రమైనవి ఈ కొండల చుట్టూ అనేక పురాణ, ఇతిహాస కథలు అల్లుకొని ఉన్నాయి. అందుకే తిరుమల గిరులను తీర్థాద్రి అని పిలుస్తారు. ముక్కోటి తీర్థాలున్న ఈ తిరుమల క్షేత్రంలో 365 రోజుల పాటు తీర్థ విశేషం ఉంటుందని పండితులు చెప్తారు. ఇటీవల శ్రీ కుమారధార తీర్థ ముక్కోటిని టీటీడీ అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ పర్వదినాన భక్తులు తీర్థ స్నానం ఆచరించి, దాన ధర్మాలు చేసి స్వామి వారిని దర్శించుకుంటారు. ప్రకృతి సౌందర్యాల మధ్య కుమారధార తీర్థంలో స్నానం చేయడాన్ని భక్తులు పవిత్రంగా భావిస్తారు.
ఫాల్గుణ పౌర్ణమి నాడు కుమారధార తీర్థ ముక్కోటి నిర్వహించడం అనవాయితీ. ఇతి హాసాల్లో ఈ తీర్థానికి ప్రత్యేక స్థానం ఉంది. వరాహ, మార్కండేయ పురాణం ప్రకారం వృద్ధ బ్రాహ్మణుడు శేషాచల గిరుల్లో ఒంటరిగా సంచరిస్తుండేవాడు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారు అతని ఎదుట ప్రత్యక్షమై ఈ వయసులో కళ్లు కనిపించవు, చెవులు కూడా సరిగా వినిపించవు అడవిలో ఏంచేస్తున్నావు అని ప్రశ్నించారట.
యజ్ఞ, యాగాలు చేసి దైవరుణం తీర్చుకోవాలనే తలంపుతో ఉన్నానని వృద్ధుడు బదులిచ్చారట. అనంతరం స్వామి వారి సూచనతో ఈ తీర్థంలో వృద్ధుడు స్నానం ఆచరించగా 16 ఏళ్ల నవ యువకుడిగా మారిపోయారు. వృద్ధాప్యం నుంచి కౌమార దశలోకి మారడం వల్ల ఈ తీర్థానికి ‘కుమార ధార’ అనే పేరు వచ్చింది.
పద్మ, వామన పురాణాల ప్రకారం.. దైవలోకం సేనాధిపతి కుమార స్వామి రాక్షసుడైన తారకాసురుడి సంహారం తర్వాత శాపవిమోచనం కోసం ప్రయత్నించాడు. శివుడి సూచనతో శేషాచల పర్వతాల్లోని వృషాద్రిలో తపస్సు ఆచరించాడు. ఈ తీర్థంలో స్నానం ఆచరించి శాపవిమోచనం పొందాడు. సాక్షాత్తు కుమారస్వామి స్నానం చేయడం వల్ల ఈ తీర్థానికి ‘కుమార ధార’ అనే పేరు స్థిరపడింది.