Pithapuram : ఏపీలో అంతటా ఎన్నికల హడావిడే కనిపిస్తోంది. జగన్ ను గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కెల్లా పిఠాపురంలో ఎవరు గెలుస్తారు? అనే విషయమే హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఇక్కడ జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేస్తుండడమే.
పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. అయితే అప్పటికీ జనసేన క్షేత్రస్థాయిలో బలంగా లేకపోవడం, రూపాయి ఖర్చు లేకుండా ఎన్నికల్లో పోటీ దిగడం, ముక్కోణ పోటీ..లాంటి కారణాలతో జనసేనకు దారుణ ఫలితాలు వచ్చాయి. రాబోయే ఎన్నికల్లో అలాంటి పరిస్థితి ఎదురుకావొద్దని పొత్తులు పెట్టుకుని రంగంలోకి దిగారు. దీంతో వైసీపీ, టీడీపీ కూటమి మధ్య హోరాహోరీ పోటీ సాగబోతోంది. ఈక్రమంలో పిఠాపురంలో పవన్ పరిస్థితి ఏంటి? అనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది.
పిఠాపురం నియోజకవర్గం గతంలో సుమారు లక్ష మంది ఓటర్లే ఉండేవారు. చిన్న నియోజకవర్గమే కావడంతో 50వేల ఓట్లకు పైబడి తెచ్చుకుంటే గెలిచేవారు. ప్రస్తుతం ఆ నియోజకవర్గ ఓటర్లు 2.10లక్షల ఓటర్లకు పైమాటే. అంటే విజేతగా నిలువాలంటే కచ్చితంగా లక్ష పదివేలకు అటుఇటుగా తెచ్చుకోవాలి. ఇక రాష్ట్రంలోనే కాపులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గమిదే. అందుకే పవన్ ఈ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు సై అన్నారు. ఇక్కడ కాపుల ఓట్లు 90వేల దాక ఉన్నాయి. దీంతో పవన్ గెలుపు నల్లేరుపై నడకే అనే విశ్లేషణలు ఊపందుకున్నాయి. తాను గెలిస్తే నియోజకవర్గాన్ని సొంత ఇల్లు చేసుకుని, ఎవరూ చేయలేని అభివృద్ధిని తాను చేస్తానని హామీ ఇస్తున్నారు పవన్.
అయితే పవన్ దీటుగా తాను కూడా కాపు బిడ్డనేనని వంగా గీత కూడా జనాల్లోకి వెళ్తున్నారు. అయినా తాను కులరాజకీయాలు చేయడం లేదని సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమానికి తాను హామీ ఇస్తున్నానని చెప్తున్నారు. ఈ నియోజకవర్గంలో గతంతో త్రిముఖ పోరు జరిగింది. ఈ సారి ద్విముఖ పోరే కాబట్టి లక్షకు పైగా ఓట్లు తెచ్చుకున్నవారే విజేత. పవన్, వంగా గీతలో ఎవరు లక్షకు పైగా ఓట్లు సాధిస్తారో చూడాలి.