Ambedkar Jayanti : అంబేద్కర్ జయంతి రోజున మనం ఆయనకు ఇచ్చే ఘన నివాళి ఇదే..
Ambedkar Jayanti : డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్.. పరిచయం అక్కర్లేని పేరు. ప్రపంచ మేధావుల్లో అంబేద్కర్ ఒకరు. ఆయన చదువుకున్న చదువు పదిమందికి వెలుగు నిచ్చింది. భారత రాజ్యాంగాన్ని రచించిన మేధావి ఆయన. ఎన్నో దేశాలకు మార్గదర్శకంగా నిలిచిన రాజ్యాంగాన్ని రచించిన ఆయన శక్తిసామర్థ్యాల గురించి అందరికీ తెలుసు.
అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న జన్మించారు. ఆయన తల్లిదండ్రులకు పద్నాలుగో సంతానం. ఆయన తండ్రి రిటైర్డ్ సుబేదార్ రాంజీ మాలోజీ బ్రిటిష్ సైన్యంలో పని చేసేవారు. సంత్ కబీర్ భక్తుడు. అతడికి జన్మించిన అంబేద్కర్ కు చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. అంటరాని తనం అంబేద్కర్ లో వ్యతిరేక భావాలు కలిగేలా చేసింది. బొంబాయిలో ప్రాథమిక విద్య పూర్తి చేశారు.
చదువుకోవాలనే తన కలను ఏనాడు వదలలేదు. బరోడాకు చెందిన సాయాజీ రావు గైక్వాడ్ అందించే పారితోషికంతో తన చదువు పూర్తి చేశారు. మిగతా చదువు కోసం అమెరికా వెళ్లి కొలంబియా విశ్వవిద్యాలయంలో ఎంఏ, పీహెచ్ డీ డిగ్రీ సంపాదించారు. లండన్ కు తిరిగి వెళ్లి అంబేద్కర్ బార్ ఎట్ లా డిగ్రీ పొందారు. సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషిని ఎవరూ మరువలేరు.
దళితులు, బలహీన వర్గాలకు న్యాయం జరగాలని నినదించారు. మహాత్మాగాంధీతో విభేదించి మరీ పోరుబాట పట్టారు. దేశ తొలి న్యాయ శాఖ మంత్రిగా సేవలందించారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలోనూ, లౌకిక దేశంగా రూపొందించడంలో తమదైన ముద్ర వేశారు. భారత రాజ్యాంగ నిర్మాతగా ఎంతో కీర్తి గడించారు. మన దేశ రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది.
మనం రాజ్యాంగ ఫలాలను ఇప్పటికీ కూడా అనుభవిస్తున్నాం. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఎన్నో దేశాలకు మార్గదర్శకంగా మారింది. ఈనేపథ్యంలో భారత జాతి గర్వించదగ్గ నేతల్లో అంబేద్కర్ ఒకరు కావడం గమనార్హం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని సదా గౌరవించడమే ఆయన జయంతి రోజు(ఏప్రిల్ 14)న ఆయనకు ఇచ్చే మనం ఇచ్చే ఘన నివాళి.