KCR Family : తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫ్యామిలీ 2024 ఎంపీ ఎన్నికలకు ఈసారి దూరంగా ఉన్నారు. కేసీఆర్ కుటుంబం ఎన్నికలకు దూరంగా ఉండటం ఇదే మొదటిసారి. 2001లో పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ ప్రతి ఎన్నికలో ఎక్కడో ఒక చోట నుంచి బరిలో నిలవడం గమనార్హం. ఈనేపథ్యంలో కేసీఆర్ అండ్ ఫ్యామిలీ ఎన్నికలకు దూరంగా ఉండడంపై అందరిలో ఆశ్చర్యం కలగక మానదు.
2004లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ సిద్ధిపేట అసెంబ్లీ, కరీంనగర్ లోక్ సభ స్థానాల్లో పోటీ చేసి రెండు చోట్ల విజయం సాధించారు. సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కరీంనగర్ లోక్ సభ స్థానంలో కొనసాగారు. యూపీఏ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా బాధ్యలు చేపట్టారు. తరువాత జరిగిన పరిణామాల్లో తెలంగాణ ఉద్యమం కోసం మళ్లీ రాజీనామా చేశారు.
2006, 2008 సంవత్సరాల్లో రెండు సార్లు రాజీనామా చేసి కరీంనగర్ నుంచి విజయం సాధించారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో రెండుసార్లు రాజీనామా చేసి కరీంనగర్ పార్లమెంట్ నుంచి గెలుపొందారు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించి గజ్వేల్ నుంచి పోటీ చేసి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. సీఎంగా పదేళ్లు కొనసాగి ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నారు.
2019 ఎన్నికల్లో కేసీఆర్ ఎంపీగా పోటీ చేయకున్నా కూతురు కవితను నిజామాబాద్ నుంచి పోటీలో నిలిపారు. కానీ ఆమె పరాజయం పాలైంది. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమి మూటగట్టుకుంది. కానీ 2024లో మాత్రం కేసీఆర్ కుటుంబం మొత్తం ఎన్నికల్లో దూరంగా ఉండటం రికార్డే. ప్రతి ఎన్నికలో తమ ప్రభావం చూపించే కేసీఆర్ ఈసారి మాత్రం మౌనంగా ఉండిపోయారు.
మల్కాజిగిరి, మెదక్ ఎంపీ స్థానాల నుంచి కేసీఆర్ పోటీలో ఉంటారని భావించారు. కానీ ఆయన మనసు మారలేదు. పోటీకి విరామం ప్రకటించి వెనక్కి తగ్గారు. ఈనేపథ్యంలో కేసీఆర్ కుటుంబం పోటీకి నై అనడానికి కారణాలేంటో తెలియడం లేదు.