AP Employees : చేసుకున్నోళ్లకు చేసుకున్నంత.. ఏపీ ఉద్యోగుల తీరు ఇదీ!
AP Employees : ఏపీలో తమ నెత్తి మీద తాము చేయి పెట్టుకున్న వర్గాల్లో ఉద్యోగులు ముందు వరుసలో ఉంటారు. తాము రెండు చేతులతో ఓట్లేసి జగన్ రెడ్డి సర్కార్ ను గెలిపించామని ఘనంగా చెప్పుకున్న వారికి.. జగన్ రెడ్డి నెత్తిన టోపీ పెట్టారు. ఐదేళ్లలో ఖర్చులు.. ద్రవ్యోల్బణం రెట్టింపు అయినా.. ఒక్క డీఏ ఇవ్వకపోగా.. గత ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీని కూడా తగ్గించారు. అంటే మొత్తంగా పిల్లిబిత్తిరి లెక్కలు చెప్పి.. జీతాలను తగ్గించేశారు.
పోనీ జీతాలు తగ్గించారు కదా అని అడగడానికి వీలు లేకుండా ఆ జీతాలనూ సక్రమంగా ఇవ్వలేకపోతున్నారు. జీతం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. గట్టిగా మాట్లాడితే జీతం కూడా ఇవ్వరేమోనని ఉద్యోగ సంఘాల నేతలు.. ఉద్యోగుల్ని భయపెట్టారు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు వచ్చిందా అని వారు వెనక్కి చూసుకున్నారో లేదో తెలియదు కానీ.. ఐదేళ్లలో ఉద్యోగుల జీతాల నుంచి కత్తిరించుకున్న సొమ్ము.. చట్టబద్ధంగా తమకు ఇవ్వాల్సిన సొమ్ములు అక్షరాలా రూ.21వేల కోట్లు ప్రభుత్వం దగ్గర ఉండిపోయింది. ఇవ్వమంటే ఇవ్వడం లేదు. ఉద్యోగులు రిటైర్ అయితే బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని రిటైర్ మెంట్ వయసు పెంచి అతి తెలివిని చూపించారు.
ఎన్నికల నోటిఫికేషన్ రేపోమాపో వస్తుందంటే ఇప్పుడు కొత్తగా చర్చలంటూ హడావిడి చేస్తున్నారు. ఇదంతా ఉద్యోగ సంఘాల నేతల డ్రామా. వారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆరు నెలల కిందటే తమ డిమాండ్ల కోసం రోడ్డెక్కేవారు. ఇప్పుడు పది రోజుల్లో షెడ్యూల్ వచ్చే సమయంలో చేయగలిగిందేమీ లేదు. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్లుగా ప్రభుత్వం ఎంత ఇస్తే అంత తీసుకుని.. సర్దుకుపోవాల్సిందే. చేసుకున్న వాడికి చేసుకున్నంత మరి. ఇక ఎప్పుడూ ఏ ప్రభుత్వంపైనా పోరాడలేనంత బలహీనంగా ఉద్యోగుల్ని..ఉద్యోగ సంఘ నేతలు మార్చేశారనే చెప్పాలి.