Joined Congress IT Attacks : రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వేడి మరింత పెరిగింది. అన్ని పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ర్టంలో ధన ప్రవాహం కొనసాగుతున్నది. ఓటర్లను మభ్య పెట్టేందుకు అన్ని పార్టీలు ఇప్పటికే కోట్లాది రూపాయలను తరలిస్తున్నాయి. ఈ క్రమంలో పోలీసులు కూడా పెద్ద ఎత్తున నగదు నిల్వలను, రవాణా సమయంలోనూ పట్టుకుంటున్నారు. ఇక ఇదే సమయంలో పలువురు అభ్యర్థుల ఇండ్లపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి.
అయితే ఈ సోదాలు ఎక్కువగా కాంగ్రెస్ అభ్యర్థుల ఇండ్లలోనే జరుగుతున్నాయి. గతంలో అభ్యర్థులు కిచ్చెన్నగారి లచ్చన్న, పొంగులేటి ఇండ్లపై దాడులు నిర్వహించిన ఐటీ అధికారులు తాజాగా మంగళవారం మంచిర్యాల జిల్లా చెన్నూర్ అభ్యర్థి వివేక్ ఇంటిపై దాడులు నిర్వహించారు. రెండు మూ డు రోజుల క్రితం వివేక్ కంపెనీలో జరిగిన ఓ ట్రాన్సాక్షన్ ను కూడా అధికారులు సీజ్ చేశారు. దీనిపై కూడా విచారణ జరుగుతున్నది.
అయితే విశాఖ ఇండస్ర్టీస్ తో పాటు వీఆర్, వెలుగు మీడియా సంస్థల అధినేత గా ఉన్న వివేక్ పెద్ద సంఖ్యలో కంపెనీలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ లో చేరడంతో అధికార పార్టీ ఆయన కదలికలపై నిఘా పెట్టింది. కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున మనీ సపోర్ట్ చేస్తున్నట్లు ఊహాగానాల నేపథ్యంలో ఆయనపై పట్టుబిగిస్తున్నారు. మంగళవారం ఉదయం ఒక్కసారి గా చెన్నూర్ లో ని నివాసంతో పాటు హైదరాబాద్లోని పలు చోట్ల దాడులు మొదలయ్యాయి.
అయితే వివేక్ బంధువులు, ముఖ్య అనుచరుల ఇండ్లపైనా ఈ ఐటీ దాడులు జరిగినట్లు సమాచారం. 20 ప్రాంతాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. అయితే మొన్నటివరకు బీజేపీలోనే ఉన్న వివేక్ , ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు. కొద్ది రోజుల్లోనే ఆయన పై ఐటీ దాడులు జరగడం కక్ష సాధింపులో భాగమనే అభిప్రాయం ఆయన అనుచరుల నుంచి వినిపిస్తున్నది. రాజకీయంగా ఎదుర్కోలేకే బీఆర్ఎస్, బీజేపీ కలిసి ఇలాంటి దాడులు చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు.