China Economy : చైనాలో ఆర్థిక పరిస్థితులు కళ్లకు కట్టే వీడియో ఇదీ
China Economy : అమెరికాకు దీటుగా అన్ని రంగాల్లో చైనా ముందుంది అని అక్కడి పాలకులు చెప్పే మాటలు ప్రగాల్భాలే అని తెలుస్తోంది. చైనా ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు బాగాలేవని, మరో నాలుగేళ్లలో మరింత పతనం కానుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(ఐఎంఎఫ్) అంచనా వేస్తోంది. ప్రపంచంలోనే అమెరికా తర్వాత రెండో ఆర్థిక వ్యవస్థ అని డాంబికాలకు పోయినా.. ప్రస్తుతం ఆ దేశ జీడీపీ దారుణంగా పడిపోతోంది. వృద్ధుల జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. అయితే ఈ డొల్లతనాన్ని బయటి ప్రపంచానికి తెలియకుండా దాచాలని చూస్తున్నా బయట పడక ఆగడం లేదు. ఇప్పట్లో చైనా కోలుకుంటుందన్న ఆశలు కూడా లేవని చెబుతున్నారు.
చైనాలో ఇప్పటికే పలు వస్తువుల ధరలు పడిపోతున్నాయి. డిమాండ్ కూడా తగ్గిపోతోంది. దీంతో చైనాకు ఎగుమతులు చేసే దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. అలాగే చైనా నుంచి వేరే దేశాలకు వెళ్లే వస్తువుల ధరలూ పడిపోతున్నాయి. అయితే వీటిని దిగుమతి చేసుకునే దేశాలకు లబ్ధి చేకూరినా.. చైనాకు మాత్రం పెద్ద దెబ్బే. ఇప్పటికే అమెరికాలో చైనా వస్తువులకు డిమాండ్ తగ్గింది. ఇక భారత్ చైనా వస్తువుల దిగుమతిని తగ్గించుకునేందుకు భారీగా సుంకం విధిస్తోంది. ఇప్పటికిప్పుడు చైనా విధానాల్లో సంస్కరణలు తీసుకరాకపోతే ఇంకా పతనాన్ని కొనితెచ్చుకునే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది.
చైనా ఆర్థిక వ్యవస్థ పతనం అవుతుండడంపై ఆ దేశ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బయటకు ధనిక దేశంగా కనపడుతున్నా అంతర్గత ఆ దేశం ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. అక్కడి యువతకు ఉద్యోగ, ఉపాధి మృగ్యమైపోయింది. అలాగే ఉన్న ఉద్యోగాలకు కత్తెర పడుతుండడంతో అక్కడి యువకులు ఉన్నత చదువులు చదివినా డెలివరీ డ్రైవర్స్ గా పనిచేస్తున్నారు. ఇక అమ్మాయిలు అయితే లైవ్ స్ట్రీమర్స్ గా పనిచేస్తున్నారట. ఇక కొందరు యువకులు సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారట. అలాగే అక్కడి పరిశ్రమల్లో ఉత్పాదకత కూడా పడిపోతుందట. దీంతో పారిశ్రామిక రంగం కూడా కుదేలైపోతోందని తెలుస్తోంది. చైనా దూసుకెళ్లడానికి ప్రధాన కారణం అక్కడి పరిశ్రమలే. చైనా పరిశ్రమల్లో ప్లాస్టిక్ నుంచి మొదలు పెడితే జౌషధాల వరకు.. గుండు సూది నుంచి భారీ నౌకల వరకు తయారవుతుంటాయి. అయితే ఇప్పుడు చైనాలో నెలకొన్న పరిస్థితులతో ఆ దేశం ఉక్కిరిబిక్కిరి కావడం ఖాయం అని తెలుస్తోంది. ఇదే సమయంలో భారత్ దూసుకెళ్లేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ప్రపంచ కర్మాగారంగా మారేందుకు తగిన పరిస్థితులు ఉన్నాయంటున్నారు.