YCP : ఎన్నికల వేళ వైసీపీకి ఇది పెద్ద ఎదురుదెబ్బే!
YCP : వైసీపీ జగన్ ‘వై నాట్ 175’ టార్గెట్ తో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్నారు. ప్రత్యర్థి పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించింది. వారంతా క్షేత్రస్థాయిలో తమ పని చేసుకుంటున్నారు. ఈ ఎన్నికలు జగన్ కు చాలా కీలకం కావడంతో ఆరు నూరైనా..గెలవాల్సిందే అని ఆయన కంకణం కట్టుకున్నారు. ఇందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను ఆయన చేసుకుంటున్నారు. వైసీపీకి పెద్ద మద్దతుదారుగా ఉన్న పల్లె ఓటర్లు,వివిధ పథకాల లబ్ధిదారులు మళ్లీ తమ వైపే మొగ్గు చూపేలా చేయడానికి వలంటీర్ల వ్యవస్థ అక్కరకు వస్తుందని జగన్ భావించారు. అయితే ఆయన స్ట్రాటజీకి కోర్టు ఫుల్ స్టాప్ పెట్టింది.
వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక పద్ధతి ప్రకారం తమ పార్టీకి అనుకూలమైన వ్యక్తులను గ్రామ వలంటీర్లుగా నియమించుకుంది. గ్రామీణ స్థాయిలో అన్ని వ్యవహారాలనూ అదుపులోకి తెచ్చుకుంది. పింఛన్ డబ్బులు ఇవ్వాలన్నా.. ఏదైనా సర్టిఫికెట్ కావాలన్నా..ఏ ప్రభుత్వ పథకానికి సంబంధించిన విషయమైనా.. వాళ్ల చేతుల మీదుగానే జరగాల్సిందే. వలంటీర్లుగా ఉన్న వాళ్లందరూ వైసీపీ వాళ్లే అని సీఎం జగననే పలు సార్లు ప్రకటించడం గమనార్హం.
వలంటీర్లు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తారని.. ఎన్నికల ప్రక్రియలో ఏ రకంగా భాగమైనా వాళ్ల ప్రభావం చాలా ఉంటుందని.. అధికార వైసీపీని గెలిపించడానికి చేయాల్సిందల్లా చేస్తారని ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్న వేళ.. కోర్టు నుంచి కీలక నిర్ణయం వెలువడింది. సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లను ఎన్నికల విధుల్లో ఉపయోగించుకునే విషయమై ఈసీ స్పష్టత ఇచ్చింది. వలంటీర్లకు ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని.. సచివాలయ సిబ్బందికి కేవలం ఇంకు పూసే పని మాత్రమే అప్పగించాలని సూచించింది.
ప్రతీ పోలింగ్ బూత్ లో ఒకరు మాత్రమే ఉండాలని గతంలో బూత్ లెవల్ ఆఫీసర్ గా పనిచేసిన వారిని విధుల్లోకి తీసుకోవద్దని పేర్కొంది. ఈమేరకు సీఈసీ ఇచ్చిన ఆదేశాలను సీఈవో మీనా జిల్లా కలెక్టర్లకు పంపారు. ఎన్నికల్లో వలంటీర్ల సేవలు ఉపయోగించుకుని ఓటర్లను ప్రభావితం చేసే ఆలోచనతో ఉన్న వైసీపీకి ఇది గట్టి ఎదురుదెబ్బేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.