Mudupaka Lands : విశాఖ జిల్లా ముదుపాక ల్యాండ్ పూలింగ్ వ్యవహారంలో తవ్విన కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. జిల్లా కలెక్టర్ మల్లికార్జున, ఆర్డీవో హుస్సేన్ సాహిబ్ కలిసి ఈ కథంతా నడిపించారని బాధిత రైతులు ఆధారాలతో సహ బయటపెట్టారు. ఒక పక్క తమ పక్షాన ఉన్నట్టు నటిస్తూనే పెందుర్తి తహసీల్దార్ శామ్యూల్ తమను దగా చేశారని దళిత రైతులు ఆరోపిస్తున్నారు.
ల్యాండ్ పూలింగ్ లో భూములు పోగొట్టుకున్న వారికీ ప్రభుత్వం ఇస్తామన్న ఎకరాకు 900 గజాల ఇళ్ల స్థలాలను ఇవ్వలేదు. కేవలం దళారీ జలవిహార్ రామరాజుకు రిజస్ట్రేషన్ చేస్తానన్న రైతులకు మాత్రమే ల్యాండ్ పూలింగ్ ద్వారా వచ్చే 900గజాల ఇంటి స్థలాన్ని దొంగ చాటుగా రిజిస్ట్రేషన్ చేశారు. పూలింగ్ ద్వారా ఎకరా ఒక్కంటికి 900గజాల స్థలాన్ని వీఎంఆర్డీఏ రూపొందించిన లేఔట్ లో లబ్ధిదారులకు ఇవ్వాలి. ఇది కూడా లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేసి లాటరీ పద్ధతిలో కేటాయించి రిజిస్ట్రేషన్ చేయాలి. ఈ నియమాలన్నింటినీ కలెక్టర్ పక్కన పెట్టారు. కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ కలిసి డీఫారం పట్టాలున్న రైతులను దగా చేయడం కోసం స్కెచ్ వేశారని ప్రధాన ఆరోపణ.
ఈ వ్యవహారాలపై సీబీఐ విచారణ చేయిస్తే కలెక్టర్ మల్లికార్జున లాలూచీ బయటపడుతుందని దళిత నాయకుడు నీలాపు రమణ వెల్లడించారు. రైతులకు భయపడి ఇంతవరకు లేఔట్ కూడా వేయలేదు. ఇప్పటికీ ఈ భూముల్లో రైతులు ఉన్నారు. తుప్పలు బలిసి ఉన్నాయి. లేఔట్ వేయాల్సిన వీఎంఆర్డీఏకి కమిషనర్ గా కూడా కలెక్టర్ మల్లికార్జునే ఉండడంతో ఆయన చెప్పిందే వేదం అవుతోంది. ఇదే లేఔట్ అని కాగితాల మీద చూపించి దొంగ రిజిస్ట్రేషన్లు చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. కలెక్టర్ నిజాయితీ పరుడు అయితే తక్షణమే గ్రామసభ పెట్టాలని రమణ డిమాండ్ చేస్తున్నారు.