HanuMan : తలను తన్నే వాడుంటే వాడి తలను తన్నే వాడు ఎక్కడో అక్కడ ఉండే ఉంటాడు. ఇలాంటిదే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో జరిగింది. ఒక చిన్న దర్శకుడు చేసిన సినిమా స్టార్ హీరో సినిమాను ఢీ కొనడంతో పాటు స్టార్ ప్రొడ్యూసర్ పొగరును అనిచివేసింది. అతనేవరో కాదు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, ఆ సినిమా ‘హను-మాన్’. సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి అతనికి అన్నీ అడ్డంకులే ఎదురయ్యాయి. సినిమా ప్రారంభం సమయంలోనే అవతార్ కు మించి సినిమాను చేస్తానని చెప్పాడు ప్రశాంత్ వర్మ. ఆ సమయంలో ఆయన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. ఇక అతన్ని ట్యాగ్ చేస్తూ వ్యంగ్యంగా పోస్టులు పెట్టారు. అనేక కష్టాలు పడి హను-మాన్ తీస్తే థియేటర్లు కూడా దొరకనీయలేదు. పాన్ ఇండియా రేంజ్‌లో మార్కెటింగ్ చేసినా సొంత రాష్ట్రంలో ప్రతిబంధకాలు కల్పించారు. కానీ ఆయన ఎప్పుడూ భయపడలేదు. పరిస్థితులను ఎదుర్కొన్నాడు. సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాల్లో హను-మాన్ మాత్రమే విజేతగా నిలిచిదంటే అతిశయోక్తి కాదు.
హను-మాన్ బాక్సాఫీస్ టాక్ అందుకున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. హను-మాన్ ప్రమోషన్ లో భాగంగా ప్రశాంత వర్మ ఓ సినిమా రిపోర్టర్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘మీ సినిమా బడ్జెట్ తక్కువ. ఒక రకంగా మీ సినిమా సైకిల్ అనుకుంటే అది కారుతో పోటీ పడగలదా..?’ అని రిపోర్టర్ ప్రశ్నించాడు. ‘నేను, నా సినిమాకు ఉన్న బడ్జెట్ పరంగా చూస్తే సైకిల్ గానే భావించాలి. కానీ ఆ సైకిలే రేపటి రోజు కారును ఢీకొంటుంది’ అని ప్రశాంత వర్మ ఆ సమాధానం ఇచ్చాడు. దీన్ని కూడా కొందరు ట్రోల్ చేస్తూ ప్రశాంత్ వర్మకు పొగరు, ఇంకా చాలా మాటలు అన్నారు.
కట్ చేస్తే జనవరి 13న విడుదలైన హను-మాన్ బాక్సాఫీస్ టాక్ సొంతం చేసుకుంది. పోటీగా విడుదలైన పెద్ద హీరో సినిమాను పక్కకు నెట్టడంతో పాటు ఆ సినిమా డిస్ట్రిబ్యూట్ చేసిన మరో పెద్ద నిర్మాత పొగరును కూడా అణచివేసింది. తక్కువ బడ్జెట్‌లో మంచి కంటెంట్ తో హైఎండ్ క్వాలిటీతో తీసిన ప్రశాంత్ వర్మ ‘హను-మాన్’ అతడిపై ప్రశంసల జల్లు కురిపిస్తోంది. సినిమా ప్రమోషన్ సమయంలో ప్రశాంత్ వర్మ చెప్పిన సైకిల్-కారు కథను కూడా చాలామంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో ఈ వీడియోను కొందరు సినిమా ప్రముఖులకు ట్యాగ్ చేస్తుండడం విశేషం.