Jagan Stone Attack : ఏపీ సీఎం జగన్ పై గులకరాయి విసిరి హత్య చేసేందుకు యత్నించింది నువ్వే అని మర్యాదగా ఒప్పుకో లేకపోతే చంపేస్తామంటూ పోలీసులు తన తలకి తుపాకీ గురిపెట్టి బెదిరించారని ఈ కేసులో నిందితుడి భావిస్తున్న వేముల సతీష్‌కుమార్ కన్నీరుమున్నీరయ్యారు. అసలు ఆ ఘటనా జరిగిన సమయంలో ఆ స్థలంలోనే తాను లేనన్నారు. వారు ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదంటూ వాపోయారు. రాయి వేసినట్లు ఒప్పుకోకపోతే మీ అమ్మానాన్నలను చంపేస్తామంటూ బెదిరించారని ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ కేసులో 45రోజులగా నెల్లూరు కేంద్ర కారాగారంలో జ్యుడిషియల్ రిమాండులో ఉన్న సతీష్ బెయిల్‌పై ఆదివారం విడుదలయ్య్యారు. సతీష్ తల్లిదండ్రులు వేముల దుర్గారావు, రమణ, వారి తరఫు న్యాయవాది అబ్దుల్ సలీం నెల్లూరు కేంద్ర కారాగారం వద్దకు వచ్చి అతడిని విజయవాడలోని వారి ఇంటికి తీసుకెళ్లారు.
నెల్లూరు, విజయవాడల్లో మీడియాతో సతీష్ మాట్లాడుతూ.. ‘నువ్వే నేరం చేసినట్లు ఒప్పుకో. అన్నీ మేం చూసుకుంటాం. నీకేం కాదు. రెండు రోజులు జైల్లో ఉంటావు. తర్వాత బయటకు వచ్చేస్తావు. నేరాన్ని ఒప్పుకుంటే మీకు రూ.2 లక్షలు ఇస్తాం అని పోలీసులు తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చారు. నేను ఒప్పుకోకపోవడంతో తుపాకీతో బెదిరించారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా ఉండేందుకు మరుగుదొడ్డిలోకి తీసుకెళ్లి.. అక్కడ నన్ను తీవ్రంగా హింసించి, బెదిరించేవారు’ అంటూ వాపోయాడు.
జగన్ బస్సు యాత్రకు వస్తే రూ.300 ఇస్తామని చెప్పటంతో నేను, నా ఫ్రెండ్స్ తో వెళ్లాను. అజిత్‌సింగ్‌నగర్ ఫ్లై ఓవర్ నుంచి వడ్డెర కాలనీ ఆర్చి వరకే నేను ఆ రోజు బస్సు యాత్రలో ఉన్నాను. ఆ తర్వాత ఇంటికెళ్లిపోయాను. సీఎం మీద ఎవరో రాయి విసిరారన్న విషయం నాకు తెలియదు. ఏప్రిల్ 14న నా పుట్టినరోజు కావటంతో అర్ధరాత్రి 12 గంటల సమయంలో నా స్నేహితులతో కలిసి రోడ్డుపై కేక్ కట్ చేశా. టపాసుల శబ్దానికి పోలీసులు వచ్చి ఇంటికి వెళ్లిపోవాలని చెప్పటంతో అందరం అక్కడి నుంచి వచ్చేశాం. అదే నేను చేసిన పొరపాటు. రెండు రోజుల తర్వాత రాత్రి 11.30 గంటల సమయంలో పోలీసులు మా ఇంటికి వచ్చారు. నీపై కేసు ఉంది.. రావాలంటూ గల్లాపట్టుకుని లాక్కెళ్లారు. పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లకుండా అంబాపురం, మంగళగిరి, 100 అడుగుల రోడ్డు ఇలా రాత్రంతా పలు ప్రాంతాల్లో తిప్పారు. సీఎం సారు పై రాయి విసిరింది నువ్వేనని ఒప్పుకోవాలంటూ బెదిరించారు. ఆ తర్వాత రెండు రోజులపాటు స్టేషన్‌లో నిర్బంధించి, తీవ్రంగా ఒత్తిడి చేశారు. చివరికి కోర్టులో పెట్టి జైలుకు పంపించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.