PM Modi – Team India : టీ-20 వరల్డ్ కప్ సాధించిన టీమిండియాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. భారత జాతీయ పతాకాన్ని ప్రపంచ యవనికపై ఎగురవేసిన రోహిత్ సేన విజయాన్ని మాటల్లో వర్ణించలేమని క్రికెట్ ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. టీమిండియా సాధించిన ఘన విజయాన్ని దేశమంతా సెలబ్రేట్ చేసుకుంటోంది. నిన్న రాత్రి ఏ ఒక్కరూ నిద్రపోకుండా సంబరాలు చేసుకున్నారు.
టీమిండియాకు ఎప్పుడూ మద్దతుగా ఉండే ప్రధాని మోదీ..ఈ ఘన విజయం అసామాన్యమైనది వర్ణించి అభినందించారు. ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా విజేతగా నిలిచిన తీరు చరిత్రాత్మకం అని అభివర్ణించారు. టీమిండియా ఈ మహత్తర విజయం సాధించడంపై దేశ ప్రజలందరి తరఫున శుభాభినందనలు తెలుపుతున్నానని వెల్లడించారు.
ఫైనల్లో మీ అద్భుత ప్రదర్శన పట్ల దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు గర్విస్తున్నారు అని పేర్కొన్నారు. మైదానంలో మీరు వరల్డ్ కప్ గెలిచారు.. దేశంలో ప్రతీ గ్రామంలో, ప్రతి గల్లీలోనూ ప్రజల హృదయాలను గెలిచారు అని ప్రధాని మోదీ వివరించారు.
ఈ వరల్డ్ కప్ లో టీమిండియా ప్రస్థానానికి ఒక ప్రత్యేకత ఉందని, టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా విజేతగా నిలిచిందని, ఇది అమోఘమైన ప్రదర్శన అని కొనియాడారు. టీమిండియా ఇదే పరంపరను కొనసాగించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ మేరకు వీడియో సందేశం విడుదల చేశారు. కాగా, ఫైనల్ మ్యాచ్ లో జరిగిన గొప్ప మలుపులు, క్రికెటర్ల ఆటతీరు వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాను చక్కర్లు కొడుతున్నాయి. ఇక సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ వీడియో అయితే మాత్రం సోషల్ మీడియాను షేక్ చేయడం విశేషం.