KGB One-Punch : ‘కేజీబీ వన్- పంచ్’ టెక్నిక్ తో నావల్నీని చంపేశారట..ఇంతకీ ఆ టెక్నిక్ ఏంటి?
KGB One-Punch : రష్యాలో అసలేం జరుగుతోంది బయటి ప్రపంచానికి ఏమీ తెలియదు. రష్యన్ ప్రభుత్వ మీడియా ద్వారా వచ్చిన వార్తల ద్వారానే ఆ దేశం గురించి కాస్త తెలుస్తుంది. పుతిన్ కు ఎదురుచెప్పిన ఏ ఒక్కరూ రష్యాలో బతకలేరు. పుతిన్ అభినవ హిట్లర్ గా మారిపోయాడని అంటుంటారు. తనకు అడ్డొచ్చే ఎవరినైనా అంతమొందించడం..పుతిన్ అలవాటుగా మారిపోయింది. ఆ హత్యలకు ఎలాంటి క్లూ దొరకదు. చివరకు డెడ్ బాడీ సైతం దొరకనివ్వకుండా చేస్తారు.
రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ మృతిని రాజకీయ హత్యగా పలువురు భావిస్తున్నారు. ఆయనది సహజ మరణమని ప్రభుత్వం చెబుతుండగా.. జైల్లో హింసించి చంపేశారని మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. అయితే నావల్నీని ‘కేజీబీ వన్- పంచ్’ టెక్నిక్ తో చంపేసుంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రష్యా గూఢచార సంస్థ ‘కేజీబీ’ ప్రత్యర్థులను మట్టుపెట్టేందుకు దీన్ని ఉపయోగిస్తుంది. నావల్నీని కూడా ఇదే టెక్నిక్ తో హత్య చేసుంటారని మానవ హక్కుల కార్యకర్త వ్లాదిమిర్ ఒసెచ్కిన్ అనుమానం వ్యక్తం చేసినట్టు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అవతలి వ్యక్తి ఛాతిపై గట్టిగా కొట్టడంతో ఒక్కసారిగా గుండెపోటుకు గురై చనిపోయేలా చేయడమే దీని ప్రత్యేకత అని ఒసెచ్కిన్ చెప్పినట్లు పేర్కొన్నాయి. దీన్ని కేజీబీ పాత టెక్నిక్ గా చెబుతున్నారు.
ఈసందర్భంగా ఒసెచ్కిన్ మాట్లాడుతూ..తనకు ఉన్న సమాచారం మేరకు కొద్ది రోజులు ముందుగానే ఇందుకు పథక రచన చేశారని ఆరోపించారు. మాస్కో నుంచి అందిన ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాన్నారు. క్రెమ్లిన్ మద్దతు లేకుండా కెమెరాలు తొలగించి ఈ పని చేయడం అసాధ్యమన్నారు. నావల్నీ డెడ్ బాడీని మార్చురీకి తరలించినప్పుడు ఆయన ఛాతీ, తలపై కమిలిన గాయాలు కనిపించినట్టు కథనాలు వెలువడ్డాయి. ఈక్రమంలో ఒసెచ్కిన్ వ్యాఖ్యలు వాటిని బలపరిచేలా ఉన్నాయని ఆయన మద్దతు దారులు అంటున్నారు.
ఇదిలా ఉండగా నావల్నీ డెడ్ బాడీ ఎక్కడ ఉందనేది ఎవరికీ తెలియదు. తన కుమారుడిని కడసారి చూసేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన తల్లి లియుడ్మిలా అధ్యక్షుడు పుతిన్ ను వేడుకుంటోంది. గౌరవప్రదంగా ఖననం చేసేందుకు భౌతిక కాయాన్ని తమకు అప్పగించాలని కోరారు. మరణానికి కారణం ఇంకా తెలియరాలేదని, ప్రాథమిక విచారణ నేపథ్యంలో మరో రెండు వారాల పాటు వేచి ఉండాలని అధికారులు వారికి సూచించారు. అయితే సాక్ష్యాలను దాచిపెట్టేందుకే ఇలా చేస్తోందని నావల్నీ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.