JAISW News Telugu

Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ లో చోటు దక్కించుకునేది వీరే..!

Telangana Cabinet

Telangana Cabinet

Telangana Cabinet : తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కుదిరింది. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాభివృద్ధి నిధుల కోసం ఎన్డీయే పెద్దలను కలిసిన అనంతరం కాంగ్రెస్ పెద్దలను కూడా కలువనున్నారు. రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణ చేపడతామని, అందుకు ఏఏ శాఖ ఎవరికి ఇవ్వాలని, మార్పు చేర్పులపై అధిష్టానం పెద్దలతో చర్చించనున్నారు.

కొత్తగా ఆరుగురికి..
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ వేగం పుంజుకుంది. రాష్ట్రంలో 18 మంది మంత్రులకు అవకాశం ఉండగా సీఎంతో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కాగా మరో ఆరుగురిని కేబినెట్ లో చేర్చుకునే అవకాశం ఉంది. దీని కోసం అధిష్టానం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చినట్లు సమాచారం. దీంతో తమకే పదవి దక్కాలని పార్టీలోని సీనియర్లు ప్రయత్నాలు మొదలు పెట్టారు.

నామినేటెడ్‌ పదవులు కూడా..
రాష్ట్రంలో కేబినెట్ పదవులతో పాటు 37 నామినేటెడ్ పదవుల భర్తీకి కూడా సీఎం కసరత్తు చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికలకు ముందే కొన్ని పదవులు భర్తీ చేశారు. అయితే వీటిపై కొందరు మంత్రుల అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సీఎం వద్దకు సమాచారం అందింది. పార్టీ కోసం పని చేసిన వారికి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. ఒకటి, రెండు రోజుల్లో నామినేటెడ్‌ పదవుల ఎంపిక పూర్తవుతుందని తెలుస్తోంది.

మంత్రి పదవులు ఇలా..
6 కేబినెట్ పదవుల్లో రెండు రెడ్డి సామాజిక వర్గానికి, రెండు బీసీకి, ఒకటి ఎస్టీకి, మరొకటి మైనారిటీకి ఇస్తారని తెలుస్తోంది. ఆరు పదవుల్లో హోం, విద్యా, మున్సిపల్‌, కార్మిక శాఖ లాంటివి కీలకంగా ఉన్నాయి. ఇందులో హోం శాఖను నిజామాబాద్‌కు చెందిన సుదర్శన్‌ రెడ్డికి ఇస్తారని ప్రచారంలో ఉంది.

లాబీయింగ్‌..
మంత్రి పదవులు ఆశిస్తున్న కొందరు నేతలు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి మంత్రి పదవులు ఆశిస్తున్నారు. అధిష్టానం ఆశీస్సుల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. నలుగురూ రెడ్డి సామాజికవర్గానికి చెందినవారే. ఇందులో ఇద్దరికి మంత్రి పదవులు, ఒకరికి డిప్యూటీ స్పీకర్‌ పోస్ట్,  మరొకరికి ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పదవి వచ్చే అవకాశం ఉంది.

సామాజికవర్గాల సమీకరణే కీలకం..
మంత్రుల పదవుల ఎంపికలో సామాజికవర్గాల సమీకరణే కీలకం కానుంది. రెడ్డి సామాజికవర్గం నుంచి ఎక్కువ పోటీ ఉండగా, బీసీలు ఎక్కువగానే పదవులను ఆశిస్తున్నారు. మరోవైపు వెలమ సామాజికవర్గం కోటా భర్తీ కాగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌ రావు మంత్రి పదవి ఆశిస్తున్నారు. అయితే ఆయనకు సామాజికవర్గం అడ్డుగా మారుతోంది.

Exit mobile version