Special status : ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందా? రాదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. హోదా రావాలని ప్రతీ ఆంధ్రుడు కోరుకుంటూ ఉంటాడు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో భాగంగా అప్పటి యూపీఏ సర్కార్ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చింది. హైదరాబాద్ ను కోల్పోవడం ద్వారా ఎంతో ఆదాయాన్ని ఏపీ కోల్పోయింది. రాష్ట్ర ప్రగతిని మళ్లీ జీరో నుంచి మొదలుపెట్టాల్సి వచ్చింది. దీని కోసం ప్రత్యేక హోదా ఇచ్చి ఆర్థికంగా సాయం అందిస్తే మళ్లీ రాష్ట్రం పునర్వైభవం సంతరించుకుంటుంది. అందుకే ప్రత్యేక హోదా రావాలని జనాలు కోరుకుంటున్నారు.
అయితే 2014 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం..ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్పడం మనకు తెలిసిందే. దీంతో అప్పటిదాక ఎన్డీఏలో ఉన్న అప్పటి సీఎం చంద్రబాబు ఆ కూటమి నుంచి బయటకు వచ్చేశారు. ఆ తర్వాత జగన్ రెడ్డి ఐదేండ్లు పాలించినా ఒక్కరోజు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని ఒక్క మాట మాట్లాడలేదు. రాష్ట్ర ప్రయోజనాల కన్నా తనపై కేసులను వాయిదా వేసుకోవడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో దోస్తీ కట్టాడు. మొన్నటి ఎన్నికల్లో మళ్లీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు, నితీష్ కుమార్ కీలకంగా మారారు. వీరిద్దరూ బీజేపీకి మద్దతు ఉపసంహరించుకుంటే ప్రభుత్వం కుప్పకూలుతుంది. ఈ నేపథ్యంలో బిహార్, ఏపీలకు ప్రత్యేక హోదా డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది.
అయితే ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నా నేపథ్యంలో ప్రత్యేక హోదా డిమాండ్ చర్చకు వచ్చింది. బిహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని జేడీఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రత్యేక హోదా ఇవ్వడానికి 5 అర్హతలు ఉంటాయి. అవేంటో చూద్దాం..
– పర్వతాలు, కఠినమైన భౌగోళిక స్వరూపం
– తక్కువ జనసాంద్రత, గిరిజన జనాభా అధికం
– పక్క దేశాలతో సరిహద్దు కలిగి ఉండడం
– ఆర్థిక, పారిశ్రామిక వెనుకబాటు తనం
– రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉండడం.
నేషనల్ డెవలప్ మెంట్ కౌన్సిల్(జాతీయ అభివృద్ధి మండలి) సూచించిన ఈ అర్హతలు ఉన్న రాష్ట్రాలకే ప్రత్యేక హోదా ఇస్తారు. తాజాగా బిహార్ కు ఈ అర్హతల్లేవని కేంద్రం స్పష్టం చేసింది. దీని ప్రకారం ఏపీకి కూడా ప్రత్యేక హోదా కష్టమేనని తెలుస్తోంది. ఎందుకంటే పై అర్హతల్లో ఏపీకి కూడా లేనందును కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోయే అవకాశాలే ఎక్కువ ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే దానికి బదులుగా ఆర్థికంగా సాయం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి, అమరావతికి ఆర్థిక సాయం..ఇలా భారీ ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంది.