YCP MP Candidates : ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీ 2024 ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల పూర్తి జాబితాను ఈ రోజు (మార్చి 16) ప్రకటించింది. ఇడుపులపాయలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధికి నివాళులర్పించిన అనంతరం అక్కడి నుంచే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు అభ్యర్థుల పేర్లను చదివి వినిపించారు. మొత్తం 175 మంది అసెంబ్లీకి, 25 మంది లోక్ సభ సభ్యుల వివరాలను ప్రకటించారు.
అందులో మొత్తం 25 పార్లమెంట్ సీట్లలో బీసీలకు 11, ఎస్సీ 4, ఎస్టీ 1, ఓసీలకు 9 కేటాయించారు. ఓసీలకు కేటాయించిన 9 సీట్లలో నాలుగు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికే కేటాయించారు. వారి గురించి తెలుసుకుందాం. ప్రకటించిన 25 మంది అభ్యర్థుల్లో (అనకాపల్లి) నలుగురు అభ్యర్థులు జగన్ మోహన్ రెడ్డికి సన్నిహితులైన రెడ్డి నేతలే కావడం గమనార్హం.
నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి విజయ సాయిరెడ్డి బరిలోకి దిగుతున్నారు. వైఎస్ వివేకా హత్య కేసు ఎంత రచ్చ జరిగినా జగన్ కుడిభుజంగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీ టికెట్ ను నిలబెట్టుకోగలిగారు. జగన్ మోహన్ రెడ్డికి మరో నమ్మకస్తుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని చంద్రగిరి అసెంబ్లీ స్థానం నుంచి ఒంగోలు లోక్ సభ సెగ్మెంట్ కు మార్చారు. జగన్ సన్నిహితుడు, వైఎస్సార్ కాంగ్రెస్ లో ట్రబుల్ షూటర్ గుర్తింపు సంపాదించుకున్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి రాజంపేట ఎంపీ టికెట్ దక్కించుకున్నాడు.
వైసీపీలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన నలుగురు ప్రధాన వ్యక్తులు లోక్ సభ టికెట్లు దక్కించుకోగలిగారు. వీరిలో ఎంత మంది ఈ ఎన్నికల పోరులో విజయం సాధిస్తారు? అనేది రెండు నెలల్లో తెలుస్తుంది.