Chandrababu – Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు విడుదలై ప్రభుత్వం ఏర్పాటు చేసి నెల దాటింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగగా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ కొత్త ప్రభుత్వానికి చంద్రబాబు సీఎంగా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే గత ఐదేళ్లలో ఏపీ జగన్ పాలనలో తీవ్రంగా నష్టపోయింది. రాష్ట్ర పరిస్థితి అల్లకల్లోలంగా ఉండడంతో పెట్టుబడులేవీ రాలేదు. ఫలితంగా అభివృద్ధి పనులు జరుగక రాష్ట్రం మరింత వెనుకబడింది. విభజన సమయంలో చాలా కోల్పోయిన రాష్ట్రం జగన్ రాకతో మరింత వెనుకబడాల్సి వచ్చింది.
చంద్రబాబు పాలన పగ్గాలు చేపట్టినప్పటి నుంచి పరుగులు పెట్టిస్తున్నారు. ఐదేళ్లు ఏదో జరిగింది. అదే పట్టుకొని కూర్చుంటే పనులు జరుగవు కాబట్టి వాటిని పక్కన పెట్టి వేగంగా ముందుకు కదలాలని అధికారులు, ప్రజా ప్రతినిధులను మోటివేషన్ చేస్తూనే కేంద్రం నుంచి వసూలు చేయాల్సిన వాటిపై దృష్టి పెడుతున్నారు. ఈ సారి ఎన్డీయేలో టీడీపీ కీలకంగా వ్యవహరించబోతోంది. కాబట్టి రాష్ట్ర అభివృద్ధికి ఎక్కువ మొత్తంలో నిధులు తీసుకురావాలని చంద్రబాబు అనుకుంటున్నారు. అందుకు తగ్గట్లుగానే కష్టపడుతున్నారు.
చంద్రబాబు ఇప్పటి వరకు ఏం తీసుకచ్చారంటే..
* పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అయ్యే రూ. 1,000 కోట్ల ఖర్చును కేంద్రం భరించేలా ఒప్పించారు.
* ఏపీలో హైవేల నిర్మాణం కోసం 4,770 కోట్ల నిధులు సాధించారు.
* 60వేల కోట్ల పెట్టుబడులతో కేంద్రం ఏర్పాటు చేసే BPCL రిఫైనరీ కోసం గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు పోటీ పడినా దాన్ని ఏపీలో నెలకొల్పేలా చర్యలు తీసుకున్నారు.
* కేంద్రం నుంచి GST వాటా నిధులు తెలంగాణకు రూ. 2,200 కోట్లు మాత్రమే వస్తే ఏపీకి 4,800 కోట్లు విడుదల చేసేలా చర్యలు తీసుకున్నారు.
* రాజధాని అమరావతి చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రాన్ని ఒప్పించారు. పనులను త్వరలో ప్రారంభిస్తారు.
వీటితో పాటు మరిన్ని ప్రతిపాదనలు కేంద్రం ముందుంచాడు. కేంద్రం కూడా సానుకూలంగా వ్యవహరించేలా కనిపిస్తోంది.