JAISW News Telugu

Telangana : తెలంగాణలో ప్రకృతి సహజంగా వెలసిన ప్రాంతాలు ఇవే

Telangana

Telangana

Telangana : తెలంగాణ అంటే కేవలం జానపద కళలే కాదు. ఎన్నో కళలు, కళాకారులు, ప్రకృతి సహజంగా వెలసిన సంపదకు నిలయం.  ప్రకృతి ప్రసాదంగా సిద్ధించిన ప్రాచీన స్థలాలు, కట్టడాలు ఎన్నో ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో వెలుగులోకి వచ్చినవి కొన్నే. వెలుగులోకి రాని ఎన్నో అద్భుతాలు ఇంకా ఉన్నాయి. స్వరాష్ట్ర ఏర్పాటు అనంతరం తెలంగాణ ప్రభుత్వం టూరిజంను డెవలప్ చేస్తోంది. ఇప్పటి వరకు దాగి ఉన్న అద్భుతాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నది.

కేవలం తెలంగాణనే కాకుండా దేశ వ్యాప్తంగా సుపరిచితం పోచంపల్లి. ఈ ప్రాంతం చేనేత చీరకు ప్రసిద్ధి. దేశ వ్యాప్తంగా ఇక్కడి నుంచి చీరలు ఎక్స్ పోర్ట్ అవుతుంటాయి. ఈ గ్రామాన్ని యునెస్కో గుర్తించింది.  అలాగే విభజిత సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ. ఇక్కడి రిజర్వాయర్ నుంచి హైదరాబాద్ కు నీటిని తరలిస్తున్నారు. సహజ సిద్ధంగా వెలసిన ఈ ప్రాంతాల్లో  కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇక్కడ రిజర్వాయర్ నిర్మించి ఈ ప్రాంతానికి మరింత వన్నె తెచ్చాడు.
అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని లక్నవరం ఎప్పటి నుంచో పర్యాటక ప్రాంతంగా విలసిల్లుతుంది. ఇక్కడి లక్నవరం సరస్సు పర్యాటక ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటున్నది. ప్రీ వెడ్డింగ్ షూట్స్ కు  ముందుగా  ఈ లక్నవరాన్నే ఎంచుకుంటారు. ఇటీవల తెలుగు సినిమాలు కూడా ఇక్కడ షూటింగ్ లు జరుపుకుంటున్నాయి.

తెలంగాణలో మరో ప్రముఖ ప్రాంతం వేములవాడ. ఆధ్యాత్మిక కేంద్రంగా ఎప్పటి నుంచో వెలుగొందుతున్నది. దీనిని దక్షిణ కాశీగా పిలుస్తుంటారు. తెలంగాణ ప్రజలకు వేములవాడ రాజన్న ఇలవేల్పు. ఏ శుభకార్యమైనా ముందుగా ఇక్కడి నుంచే మొదలుపెడుతుంటారు.

పర్యాటక ప్రియులు ఎంతగానో ఇష్టపడే మరో ప్రాంతం వికారాబాద్.  అనంతగిరి కొండలు ట్రెక్కింగ్ ప్రియులు ఇష్టపడే ప్రాంతం, ట్రెక్కింగ్ కు  ఈ ప్రాంతం ఎంతగానో ప్రసిద్ధి చెందింది. సహజ సిద్ధంగా వెలసిన ప్రాంతాల్లో అనంతగిరి కూడా ఒకటి.  ఉమ్మడి మెదక్ జిల్లా అడవులకు ప్రసిద్ధి. ఇక్కడి అభయారణ్యంలో ఎన్నో జంతువులు తమ మనుగడను సాగిస్తున్నాయి.  ఎన్నో వన్యప్రాణులకు నిలయం మెదక్ అభయారణ్యం.

తెలంగాణలో చేతి కళాకారులకు పుట్టినిల్లు పెంబర్తి. ఇక్కడ ఇత్తడి వస్తువులు, దేవతా విగ్రహాల తయారీలో ఇక్కడి కళాకారులు నిష్ణాతులు. దేశవిదేశాలకు ఇక్కడి ఇత్తడి వస్తువులు ఎగుమతి అవుతుంటాయి.  ఇలా చెప్పుకుంటే పోతే వెలుగులోకి రాని ఎన్నో ప్రాంతాలు తెలంగాణ లో లెక్కలేనన్ని ఉన్నాయి.

Exit mobile version