MLC Candidates : టీడీపీ, జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లే

MLC Candidates

MLC Candidates

MLC Candidates : నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. శాసన మండలిలో ఖాళీ అయిన రెండు స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసింది. బరిలో నిలిచే అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ రెండూ ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఎమ్మెల్యేల కోటాకు చెందినవే. అసెంబ్లీలో పూర్తిస్థాయి మెజార్టీ ఉండటం వల్ల అవి టీడీపీ, జనసేన ఖాతాలో పడడం ఖాయం. పోటీ పడే అవకాశం కూడా వైసీపీకి లేదు. ఫలితంగా ఈ రెండు స్థానాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం కావడం లాంఛనప్రాయమే.  వైసీపీకి చెందిన సీ రామచంద్రయ్య, ఇక్బాల్.. తమ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. దాంతో ఎన్నిక అనివార్యం అయింది. టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్సీ సీ రామచంద్రయ్య మళ్లీ మండలికి ఎంపికయ్యారు. మొన్నటి వరకూ ఆయన అదే శాసన మండలిలో వైసీపీ సభ్యుడిగా కొనసాగారు.

ఎన్నికలకు కొద్దిరోజుల ముందుకు వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకున్నారు. తన సభ్యత్వానికి రాజీనామా చేసి మరీ పార్టీలో చేరడంతో చంద్రబాబు మళ్లీ ఆయననే నామినేట్ చేశారు. దీనితో- మొన్నటి వరకు వైసీపీ పార్టీ తరఫున సభ్యుడిగా శాసన మండలిలో కొనసాగిన సీ రామచంద్రయ్య.. ఇప్పుడు టీడీపీ సభ్యుడిగా శాసన మండలిలో అడుగుపెట్టనున్నారు. ఇక్బాల్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి జనసేన సీనియర్ నాయకుడు పిడుగు హరిప్రసాద్ నామినేట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ వ్యవహారాలు చూసుకుంటున్నారు. హరిప్రసాద్.. సీనియర్ జర్నలిస్ట్. జనసేనలో చేరడానికి ముందు దినపత్రికలు, న్యూస్ ఛానళ్లలో పని చేశారు. సీ రామచంద్రయ్య, హరిప్రసాద్.. ఇద్దరూ కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్లే. నేడు వాళ్లిద్దరూ తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తారు. ఈ నెల 12న ఎన్నికలు షెడ్యూల్ అయ్యాయి. అయినా వీరి ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

TAGS