Rythu Bharosa : ప్రభుత్వ పథకాలు అర్హులకు అందితేనే బాగుంటుంది. అదే టాక్స్ పేయర్ మనీకి విలువ, గౌరవం. గత బీఆర్ఎస్ హయాంలో ‘రైతు బంధు’ నిధులు పక్కదారి పట్టాయంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ‘రైతు భరోసా’ను నీరు గార్చే ప్రసక్తే లేదు అంటోంది. అనర్హులను ఏరివేసి.. నిజమైన రైతులకే దాన్ని అమలు చేస్తామంటోంది. పూర్తి పారదర్శకంగా ఈ స్కీమ్ అమలు చేస్తామని తెలిపింది.
ఈ పథకంకు సంబంధించి గ్రామాల వారీగా సాగు భూమి ఎంత? రియల్ భూమి ఎంత? అందులో కొండలు, గుట్టలు ఎన్ని ఉన్నాయి. సాగులో లేని ఎండోమెంట్, వక్ఫ్ భూములు ఏవి ఉన్నాయి..? వంటి వివరాలను సేకరించేందుకు వ్యవసాయ శాఖ 3 రోజులుగా సర్వే చేస్తోంది. వచ్చే వారంలో సర్వే పూర్తవుతుంది.
బీఆర్ఎస్ రైతు బంధు ఎకరాకు ఏడాదికి రూ.10 వేల చొప్పున పెట్టుబడి సాయం ఇచ్చింది. కాంగ్రెస్ రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. రైతులకు, కౌలు రైతులకు కూడా పథకం అమలు చేస్తామని ఎకరాకు రూ.15 వేల చొప్పున ఇస్తామని మేనిఫెస్టోలో తెలిపింది.
ఖరీఫ్ సీజన్‌కు రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించాల్సి ఉంది. అందుకే అనర్హులను తొలగించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయితే గానీ రైతు భరోసా అమలవ్వదు. అప్పటి వరకు రైతు బంధు కిందే నిధుల పంపిణీ జరుగుతోంది.
కొత్త మార్గదర్శకాలు ఇవీ
ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ చెల్లింపుదారులు, ప్రజా ప్రతినిధులు, బడా వ్యాపారులకు ఈ పథకం వర్తించదు. బీడు భూములు, రోడ్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు నిధులు ఇవ్వరు. దీంతో ప్రభుత్వానికి చాలా మనీ మిగులుతుంది. రైతు భరోసాను 5 ఎకరాల లోపు మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలా చేస్తే, రైతుల నుంచి విమర్శలు ఎదుర్కోక తప్పదని బీఆర్ఎస్ అంటోంది. 5 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే నష్టపోవాలా? అని ప్రశ్నిస్తోంది. మూడేళ్లుగా సాగు చేయని రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వరు. ఈ మార్గదర్శకాలు ఇంకా అధికారికంగా రాలేదు.