CM Revanth : హైదరాబాద్ లో శనివారం ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు ప్రజా భవన్ లో విభజన సమస్యల గురించి కలిశారు. రెండు రాష్ట్రాలకు అనుగుణంగా అన్ని ప్రయోజనాలు సమకూరేలా మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ లో విభజన సమస్యల విషయంలో చర్చించారు. తెలంగాణలోని భద్రాచలం నుంచి ఏపీలో కలిసిన 7 మండలాల్లోని 5 గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకు విన్నవించారు.
ఎటపాక, గుండాల, పురుషోత్తపట్నం, కన్నాయిగూడెం, పిచ్చులకపాడు గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని ప్రతిపాదించారు. దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రికి లేఖ రాయాలని తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. అయితే హైదరాబాద్ ఉన్న కొన్ని భవనాలను ఏపీకి కేటాయించాలని అడగ్గా వారు తిరస్కరించినట్లు తెలుస్తోంది.
రాష్ట్ర విభజన తర్వాత చాలా సమస్యలు ఇరు రాష్ట్రాలు పరిష్కరించుకోవాల్సి ఉండగా.. అవి పెండింగ్ లో ఉన్నాయి. అయితే చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రభుత్వానికి సమస్యలు పరిష్కరించుకుందామని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయగా.. దీనికి అంగీకారం తెలిపారు. ఏపీ తెలంగాణకు మంచి జరగాలని కోరుకుంటున్నాని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలు గౌరవంగా, అభివృద్ధి పథంలో దూసుకుపోయేలా చేయడం మన కర్తవ్యమన్నారు.
పెండింగ్ సమస్యలను పరిష్కరించుకోవడానికి మూడంచెల విధానాన్ని ప్రతిపాదించారు. దీని కోసం రెండు రాష్ట్రాల కార్యదర్శులు, మంత్రులతో ఒక కమిటీ వేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో పరిష్కారం సమస్యల్ని సీఎం వద్దకు తీసుకెళ్లాలని తద్వారా పెండింగ్ సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల విన్నపాలను అధికారికంగా ఇచ్చి పుచ్చుకున్నారు. అయితే డ్రగ్స్ సమస్య రెండు రాష్ట్రాలను వేధిస్తోందని దీన్ని సమూలంగా నిర్మూలించకపోతే మరో పంజాబ్ లాగా మారి తెలుగు రాష్ట్రాలకు ఇబ్బంది తప్పదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీనికి సంయుక్తంగా కట్టడి చేసే ప్లాన్ చేయాలని కోరారు.