Mahesh Kumar Goud : తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పదేళ్లు తెలంగాణను పాలించిన కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణలో జరిగింది అభివృద్ధి కాదు.. మొత్తం అన్యాయమేనని విమర్శించారు. కేసీఆర్ పాలనలో జరిగిన భూముల దోపిడి అంతా ఇంతా కాదని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారమయం అయ్యిందని.. పేదలు అష్టకష్టాలు పడ్డారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టిన, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి గుండు సున్నా సీట్లు ఇచ్చినా, బీఆర్ఎస్ పార్టీ నేతల తీరు మాత్రం మారడం లేదని మండిపడ్డారు.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు బలంగా ఉండాలని, కాంగ్రెస్ కోరుకుంటోందని అన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై… కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై చర్చకు తాను సిద్ధమని మహేష్ గౌడ్ సవాల్ విసిరారు. ప్రజా పాలన-ప్రజా విజయోత్సవాల్లో భాగంగా 2024, నవంబర్ 19వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో సభ ఏర్పాట్లపై ఉమ్మడి వరంగల్ డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో శనివారం మహేష్ గౌడ్ సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం కంటే మెరుగైన పాలన అందిస్తున్నామని, అందుకే విజయోత్సవాలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలో రావడానికి వరంగల్ జిల్లా కీలక పాత్ర పోషించిందన్నారు. వరంగల్ అంటేనే పోరాటాలు, చైతన్యానికి మారుపేరు అని కొనియాడారు.