Beggars : ఇక ఈ నగరాల్లో బిచ్చగాళ్లు ఉండరు.. తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన నగరాలు ఏవంటే..

There will be no beggars in these cities

There will be no beggars in these cities

Beggars : మన దేశంలో బిచ్చగాళ్లకు కొదువ లేదు. కొన్ని లక్షల సంఖ్యలో ఉన్నారు. నగరాలు, పట్టణాల్లోనూ, పుణ్యక్షేత్రాల్లోనూ ఎంతో మంది భిక్షాటన చేస్తూ ఉంటారు. వారిని చూసి జాలిపడడమే కాదు ఒక్కోసారి విసుగు కూడా వస్తూ ఉంటుంది. ట్రాఫిక్ జంక్షన్లలో చంటిబిడ్డను చంకన ఎత్తుకుని వచ్చి మరీ అడుక్కుంటుంటారు. వీరికి పదో, పరకో ఇచ్చే వారు కొందరైతే, వీరిని చూసి ఇరిటేట్ గా ఫీలయ్యే వారు మరికొంత మంది. ఏదేమైనా భిక్షాటన అనేది ఎంతో మంది పేదల దీనస్థితిని తెలియజేస్తుంది. సరైన ఉపాధి లేక కొందరు, నా అన్నవాళ్లు లేక కొందరు, అంగవైకల్యంతో కొందరు భిక్షాటన చేస్తుంటారు. ఇంకా కొందరు చిన్నపిల్లలు, మహిళలతో ముఠా కట్టి మరీ భిక్షాటన చేయిస్తుంటారు.

అయితే వీటన్నంటికి చెక్ పెట్టేలా కేంద్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు బిచ్చగాళ్లు లేని దేశంగా మార్చనుంది. కేంద్రం బిచ్చగాళ్ల డేటాపై ఓ నివేదిక రూపొందించింది. ముందుగా యాచకులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాను సర్వే చేయించింది. ఆ తర్వాత దీనికి చెక్ పెట్టేలా భారత్ ను యాచక రహితంగా మార్చే ప్రణాళికతో ముందుకొచ్చింది. అందులో భాగంగా కీలకమైన 30 నగరాలను ఎంపిక చేసింది.

భిక్షాటన చేస్తున్న వాళ్లలో ప్రధానంగా పిల్లలు, మహిళలు ఉన్నారు. వీరికి పునరావసం, ఉపాధి కల్పించనుంది. కేంద్ర సామాజిక సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ ‘‘భిక్షా వృత్తి ముక్త్ భారత్’’ కార్యక్రమం జరుగనుంది. మున్సిపల్ అధికారులు దీనికి తోడ్పాటు అందించనున్నారు. 2026 వరకు ఈ 30 నగరాల్లో భిక్షాటన లేకుండా చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఆ తర్వాత మరిన్ని నగరాల్లో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు.

కేంద్రం ఎంపిక చేసిన 30 నగరాల్లో మతపరమైన, చారిత్రక, పర్యాటక ప్రాముఖ్యత ఉన్న నగరాలు ఉన్నాయి. 10 మత పరమైన నగరాల్లో అయోధ్య, కాంగ్రా, ఓంకారేశ్వర్, ఉజ్జయిని సోమనాథ్, పావగఢ్, త్రయంబకేశ్వర్, బోధగయ, గౌహతి, మధురై ఉన్నాయి. పర్యాటక ప్రదేశాల్లో విజయవాడ, కెవాడియా, శ్రీనగర్, సంసాయి, కుషినగర్, సాంచి, ఖజురహో, జైసల్మీర్, తిరువనంతపురం, పుదుచ్చేరి ఉన్నాయి. చారిత్రక నగరాల్లో అమృత్ సర్, ఉదయ్ పూర్, వరంగల్, కటక్, ఇండోర్, కోజికోడ్, మైసూర్, పంచకుల, సిమ్లా, తేజ్ పూర్ వంటివి ఉన్నాయి.

ఈ నగరాల్లో తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన విజయవాడ, వరంగల్ ఉండడం విశేషం. ఇవి రెండు మత, పర్యాటక, చారిత్రక నగరాలు. వందల సంఖ్యలో భిక్షాటన వృత్తిని ఇక్కడ కొనసాగిస్తున్నారు. ఇక వారందరికీ అవసరమైతే ఉపాధి, లేదా పునరావసం కల్పించనున్నారు. దీంతో మనకు ఇక ఎక్కడా బిచ్చగాళ్లు కనపడరు. మనల్ని ఇబ్బంది పెట్టరు.

TAGS