Nagababu : పవన్ కళ్యాణ్ మాటల్లో అంత అర్థం ఉంది..: నాగబాబు..
Nagababu : హిందూ ధర్మం ప్రమాదంలో ఉందనేది ఒప్పుకోవాల్సిన నిజమని, కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీయే క్లైమాక్స్ లాంటిదని అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ వివరించాడని జనసేన జాతీయ కార్యదర్శి, నటుడు నాగబాబు అన్నారు. మనిషికి బతకడం, బట్ట కట్టడం, ఆధునిక జీవనం సైతం నేర్పంచింది సనాతన ధర్మమేనని దానికి అన్యాయం జరుగుతుందనే పవన్ కళ్యాణ్ ఆవేదన అని ఆయన అన్నారు.
సోమవారం (సెప్టెంబర్ 30) మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘ పవన్ కళ్యాణ్ మాటల్లోని ప్రతీ వ్యాఖ్యాన్ని నేను పూర్తిగా సమర్థిస్తున్నా. హిందూ దేవాలయాల నిర్వహన, ధార్మిక మండళ్లను సైతం హిందువులే నిర్వహించాలి. ఆయా రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాల నిర్ణయాలు కోట్లాది మంది హిందువులను ప్రభావితం చేస్తున్నాయని పవన్ కళ్యాణ్ బాధ. అన్ని మతాలకు సమానమైన విలువను ఇచ్చే వ్యక్తి పవన్ కళ్యాణ్. హిందూ ధర్మ రక్షణ మండలి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, దోషులు ఎవరున్నా బయటకు వస్తారని సూచించారు. వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు.
వైసీపీ పాలన బాగుంటే ఇప్పుడు దేశం మొత్తం శ్రీవారి లడ్డూ గురించి మాట్లాడుకునేదా? అని ప్రశ్నించారు. ఇంత పెద్ద తప్పు జరిగినా కూడా ఆరోపణలు అంటూ ఎదురు మాట్లాడడం ఎంత వరకు కరెక్ట్ అని ఆయన నిలదీశారు. ఇలాంటి పనులు సమాజానికే కాదు.. దేశానికి సైతం మంచిది కాదన్నారు. శ్రీవారికి కేవలం దేశంలోనే కాదు.. ప్రపంచంలోని నలు మూలల భక్తులు ఉన్నారని ఆయన అన్నారు.