Venkaiah Naidu : ఉచితంగా విద్య, వైద్యం అందించడంలో తప్పులేదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించడం కోసం దాదాపు అన్ని పార్టీలు ఉచిత హామీలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెకయ్యనాయుడు సోమవారం సాయంత్రం రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషన్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నివాసంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు సంఘాల ప్రముఖులు, జర్నలిస్టులు పాల్గొని ఆయనకు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ కొన్ని పార్టీలు ఇష్టానుసారం హామీలను ఇస్తున్నాయని అన్నారు. విద్య, వైద్యం ఉచితంగా అందించడంలో తప్పు లేదన్నారు. కానీ, ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసే ఉచితాలు ఏవీ కూడా సరైనవి కాదన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడానికి నిధులు లేక.. మళ్లీ అప్పులు చేయడం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. అలాగే పదవులకు రాజీనామా చేయకుండా పార్టీలు మరి నేతలను విమర్శించడం సరికాదని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.