India Vs England : టీ-20 వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికా-అఫ్గనిస్తాన్ మ్యాచ్ కు రిజర్వు డే ఉండగా ఇండియా-ఇంగ్లాండ్ మ్యాచ్ కు లేదు. దీంతో టీమిండియాకు రిజర్వు డే ఎందుకు లేదని అభిమానులు చర్చించుకుంటున్నారు.
సౌత్ ఆఫ్రికా, అప్గనిస్తాన్ జట్ల మధ్య ట్రినిడాడ్ వేదికగా గురువారం (భారత కాలమానం ప్రరానం జూన్ 27) ఉదయం 6 గంటలకు తొలి సెమీ ఫైనల్ జరగనుంది, ఈ మ్యాచ్ కు శుక్రవారంను రిజర్వు డేగా ఉంచారు. వర్షం కారణంగా షెడ్యూల్ సమయంలో మ్యాచ్ పూర్తికాకపోతే.. అదనంగా మరో 60 నిమిషాలు కేటాయించారు. రిజర్వు డే రోజు 190 నిమిషాల అదనపు సమయం కూడా కల్పించారు. షెడ్యూల్ రోజున అవసరమైతే ఓవర్లు కుదించి అయినా.. మ్యాచ్ ను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. వర్షం కారణంగా అది కూడా సాధ్యం కాని పక్షంలో రిజర్వు డేకు తీసుకెళతారు. షెడ్యూల్ రోజున టాస్ వేసాక మరోసారి వేయరు. ఇక వర్షం కారణంగా మ్యాచ్ అసలే జరగకపోతే టాప్ ర్యాంక్ జట్టు ఫైనల్స్ కు వెళుతుంది.
భారత్-ఇంగ్లండ్ రెండో సెమీస్ గురువారం రాత్రి 8 గంటలకు (భారత కాలమానం ప్రకారం) గయానా వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ కు రిజర్వు డే లేదు. కానీ ఆ రోజున ఏకంగా 250 నిమిషాల అదనపు సమయం కేటాయించారు. రిజర్వు డే ఎందుకు లేదన్న అంశంపై ఐసీసీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు కానీ, అందుకు కారణం మాత్రం సమయమే. తొలి సెమీస్ విండీస్ కాలమానం ప్రకారం జూన్ 26 రాత్రి 8.30కి (భారత కాలమానం ప్రకారం జూన్ 27 ఉదయం 6 గంటలు) మొదలవుతుంది. ఇక రెండో సెమీస్ లోకల్ టైమ్ ప్రకారం జూన్ 27 ఉదయం 10.30కి మొదలవుతుంది. భారత కాలమానం ప్రకారం జూన్ 27 రాత్రి 8 గంటలు ఆరంభమవుతుంది. ఇక ఫైనల్ మ్యాచ్ విండీస్ టైమ్ ప్రకారం జూన్ 29 ఉదయం 10.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలు) మొదలవుతుంది. రెండో సెమీస్ కు రిజర్వ్ డే కేటాయిస్తే, ఫైనల్స్ ఆడే జట్టుకు కనీసం 24 గంటల సమయం కూడా ఉండదు. ఈ కారణంతోనే రిజర్వు డేను రెండో సెమీస్ కు కేటాయించ లేదు.