PM Modi : ఆ విషయంలో మోదీని మించినోళ్లు లేరు!

PM Modi

PM Modi

PM Modi : ఎన్నికలు వస్తున్నాయంటే చాలు సర్పంచ్ మొదలుకుని ప్రధాని దాక నానా విన్యాసాలు చేస్తుంటారు. ఎన్నికల్లో తమనే గెలిపించాలని చిన్న పిల్లల ముడ్లు కడిగేదాని నుంచి కాక హోటళ్లో మిర్చీ బజ్జీలు వేసేదాక ఓటర్లను ఆకట్టుకునే ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఎన్నికలవేళ రాజకీయ నాయకులు ఎన్నెన్నో చిత్రవిచిత్రాలు చేస్తుంటారు. వీటిని కొందరు నమ్మేవారు ఉంటే.. మరి కొందరు ఎన్నికల స్టంట్ అని తిట్టిపోసేవారు కూడా ఉంటారు.

ప్రస్తుత రాజకీయాల్లో ప్రచారం అనేదే కీలకం. సోషల్ మీడియా, మెయిన్ మీడియా ఇలా వీటిని ఎవరూ గుప్పిట పడుతారో వారిదే విజయం. తిమ్మిని బమ్మిని చేయడం.. బమ్మిని తిమ్మి చేయడం సోషల్ మీడియాతోనే సాధ్యం.. ఓ ప్రభుత్వం మంచి చేయలేదు అంతా చెడే చేసిందని పదే పదే చెబితే జనాలు అదే నమ్మేస్తారు. ఇక ఓ ప్రభుత్వం చెడు చేసినా.. మంచి చేసినట్టు ప్రచార హోరు సృష్టిస్తే జనాలు ఈజీగా నమ్మేస్తారు. ప్రస్తుత రాజకీయాల్లో ప్రచారం లేనిదే గాంధీ, చంద్రబోస్ లాంటి వాళ్లు కూడా గెలవలేని పరిస్థితులు ఉన్నాయి.

మన దేశంలో ఎన్నికల్లో గెలువాలంటే ‘ప్రచారం’ అనేది అత్యంత ముఖ్యమని గుర్తించిన మొదటి ప్రధాని నరేంద్ర మోదీ. ఈయనకు ముందు ఎవరూ ఇంతలా ప్రచార ఆర్భాటాన్ని నమ్ముకోలేదు. అసలు మోదీ ముఖ్యమంత్రి నుంచి ప్రధాన మంత్రి అభ్యర్థిగా పోటీలోకి వచ్చిందే ప్రచారంతో. ‘గుజరాత్ మోడల్ డెవలప్ మెంట్..’ అంటూ దేశాన్ని కూడా గుజరాత్ లా చేస్తానని హామీ ఇస్తూ ప్రధాని మంత్రి అయిపోయారు.

ఇక ప్రధాని మోదీ మొదటి టర్మ్ కు, రెండో టర్మ్ కు మరింత రాటుదేలారనే చెప్పాలి. ఇక మూడో సారి గెలవడానికి ఆయన వ్యూహాలు తయారుచేసి ఆల్రెడీ అమలు చేస్తున్నారు. నరేంద్ర మోదీ పదేండ్ల పాలనలో చేసిందేమిటంటే 370 ఆర్టికల్ రద్దు, రామాలయ నిర్మాణం.. ఈరెండు మాత్రమే మిగతా వన్నీ సగటు ప్రభుత్వాలు సైతం చేసేవే అని విశ్లేషకులు చెబుతుంటారు. మోదీ పాలనలో ధనవంతుడు మరింత ధనవంతుడిగా, పేదవాడు మరింత పేదవాడు మారిపోతున్నాడు. చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు ప్రజల జీవితాలు మారిపోయాయని, ఇండియా మొత్తం డిజిటల్ అయిపోయిందని ఆర్ఎస్ఎస్, బీజేపీ సోషల్ మీడియా గ్రూపుల్లో ప్రచారం చేసే ప్రబుద్ధులు ఉన్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పేదలకు భరోసా, ఉపాధి కల్పన..ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు. వీటన్నంటినీ పట్టించుకోరు.

కానీ 2047దాక తామే అధికారంలో ఉండాలనుకుంటారు. ఇదేంటని జనాలు ప్రశ్నించకుండా ఉండడానికి మతాన్ని వాడుకుంటారు. ఏవో మతపూరిత స్లోగన్స్ హోరెత్తిస్తారు. ఇక నిలదీయాల్సిన ప్రజలు నినాదాలు, భజనలు చేసుకుంటూ ఉంటారు. మతం ప్రతీ ఒక్కరికి ఉండేదే. ప్రతీ ఒక్కరూ ఏదో ఒక దేవుడిని మొక్కుతారు. అందులో తప్పు లేదు. ఎవరి నమ్మకాలు వారివి. కానీ ప్రభుత్వాలే ఆ పనిచేయకూడదు.

ఇక ఇలాంటి వాటిని మోదీ సరిగ్గా వాడుకుంటారు. రాబోయే రెండు, మూడు నెలల్లో ఎన్నికలు ఉండడంతో తన ప్రచార డాంబికాన్ని బయటకు తీశారు. మొన్న లక్షద్వీప్ నుంచి మొదలు.. నిన్న మహారాష్ట్రలోని నాసిక్ లోని కాలారామ్ ఆలయాన్ని శుభ్రం చేశారు. ఇదంతా వారి అనుచరగణం ఇక సోషల్ మీడియాలో తెగ తిప్పేస్తుంది. మరో 10 రోజుల్లో రామాలయ ప్రారంభోత్సవం ..ఇక ఆ ఫొటోలు, వీడియోలను ఎన్నికలు దాక సునామీల తిప్పేస్తారు. వీటిని నమ్మే జనాల్లో కోట్లలో ఉన్నారు. ఎన్నికల్లో గెలవాలంటే ‘మతం’ సెంటిమెంట్ ను మించింది లేదని ప్రగాఢంగా నమ్మే మోదీ వాటిని అమలు చేస్తుంటారు.

TAGS